పాకిస్థాన్‌లో రోజు రోజుకూ తీవ్రంగా మారుతున్న పరిస్థితులు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: పాకిస్థాన్‌లో పరిస్థితులు రోజు రోజుకూ తీవ్రంగా మారుతున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా, రాజకీయంగా తీవ్ర దుర్భర పరిస్థితులు పడుతున్న పాక్.. ఇటీవలి కాలంలో ఉగ్రవాద దాడులతో తీవ్ర సతమతం అవుతోంది. ఆత్మాహుతి దాడులు, బాంబు పేలుళ్లు, ఉగ్రవాద దాడులతో ఊపిరి పీల్చుకోలేకపోతోంది. తాజాగా రెండు రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. శుక్రవారం పోలీసులే లక్ష్యంగా ఉగ్రదాడి జరగ్గా.. తాజాగా శనివారం ఏకంగా పాక్ వైమానిక స్థావరంపై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.పాకిస్థాన్ పంజాబ్‌ ప్రావిన్స్‌లోని మియన్వాలిలో ఉన్న వైమానిక స్థావరంపై శనివారం తెల్లవారుజామున ఉగ్రదాడి జరిగింది. అయితే పాక్ సైన్యం వెంటనే ప్రతిస్పందించింది. వెంటనే ఉగ్రవాదులపైకి సైనికులు కాల్పులు జరపడంతో పెను విధ్వంసం తప్పింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని పాక్‌ ఎయిర్‌ ఫోర్స్ వెల్లడించింది. ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై ఉగ్రవాదులు దాడి చేయగానే వెంటనే ఎదురు కాల్పులు చేశామని.. దీంతో భారీ నష్టం తప్పిందని పేర్కొంది.ఫైటర్ జెట్లు ఉన్న ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోని స్థావరంలోకి ఐదారుగురు ఉగ్రవాదులు ఆయుధాలు పట్టుకుని శనివారం తెల్లవారుజామున చొరబడేందుకు ప్రయత్నించారని పాక్ ఎయిర్‌ఫోర్స్ తెలిపింది. వెంటనే అప్రమత్తమై తమ బలగాలు ఆ దాడిని భగ్నం చేశామని స్పష్టం చేసింది. తక్షణమే పాక్ సైన్యం స్పందించి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పేర్కొంది. మరో ముగ్గురిని సైన్యం చుట్టుముట్టి పట్టుకున్నట్లు తెలిపింది. ఈ ఘటనలో పాక్ ఎయిర్‌బేస్‌లోని 3 యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయని వెల్లడించింది. అయితే ఈ దాడులు చేసింది తామే అంటూ తెహ్రిక్‌ ఏ జిహాద్‌ ఉగ్రసంస్థ ప్రకటించింది.మరోవైపు.. పాకిస్థాన్‌లో శుక్రవారం కూడా ఉగ్రదాడి జరిగింది. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రాంతంలో పోలీసు బృందాలే లక్ష్యంగా ఉగ్రవాదులు బాంబులతో దాడులకు దిగారు. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. అందులో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. మరో 24 మందికి తీవ్ర గాయాలు అయ్యారని అధికారులు వెల్లడించారు. గతేడాది నవంబర్‌లో పాకిస్థాన్‌ ప్రభుత్వంతో తెహ్రిక్‌ ఏ తాలిబాన్‌ పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందం పూర్తయింది. ఆ తర్వాతి నుంచి పాక్‌లో ఉగ్రవాదం మళ్లీ ఊపందుకుని తరచూ ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌ ప్రాంతాల్లో నిత్యం ఎక్కడో ఒక చోట ఉగ్రవాదులు దాడి చేస్తూనే ఉన్నారు. ఇటీవల శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఓ మసీదు వద్ద జరిగిన బాంబు పేలుడులో 50 మందికి పైగా జనం దుర్మరణం పాలయ్యారు

Leave A Reply

Your email address will not be published.