ఎట్టి విపత్తు వచ్చినా 2,500 ఏండ్లు తట్టుకొని నిలబడేలా రామాలయ నిర్మాణం

అష్టభుజి ఆకారంలో గర్భ గుడి దేశ సంస్కృతి ప్రతిబింబించే శైలి ఆర్కిటెక్ట్‌ అశీశ్‌ సోంపురా వెల్లడి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రామ మందిర ప్రారంభోత్సవానికి అయోధ్య సిద్ధమవుతున్నది. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనున్నది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమవుతున్న ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. ఏ విధమైన విపత్తు వచ్చినా ఆలయం చెక్కు చెదరదట. ఎంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినా 2,500 ఏండ్లు తట్టుకొని నిలబడేలా ఆలయాన్ని డిజైన్‌ చేసినట్టు ఆర్కిటెక్ట్‌ అశీశ్‌ సోంపురా తాజాగా తెలిపారు. ఆలయాన్ని దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా నాగర శైలిలో నిర్మిస్తున్నారు. ఇక ముఖ్యమైన ఆలయ గర్భ గుడిని అష్టభుజి ఆకారంలో తీర్చిదిద్దుతున్నామని, గర్భ గుడి అష్టభుజి ఆకారంలో ఉన్న దేవాలయాలు తక్కువని సోంపురా వివరించారు. ఆలయ శిఖరం కూడా అష్టభుజి ఆకారంలో ఉంటుందని తెలిపారు. భక్తులకు సదుపాయాలపై మాట్లాడుతూ ప్రధాన ఆలయ సముదాయం వరకు వెళ్లే కారిడార్‌లో 35-40 వేల మంది వెళ్లే అవకాశం ఉందని, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆలయ కాంప్లెక్స్‌ లోపల తక్కువ భవనాలు ఉంటాయని, మ్యూజియం, రిసెర్చ్‌ సెంటర్‌, ప్రార్థన మందిరం వంటి ఇతర సౌకర్యాలను బయట ఏర్పాటు చేయాలని అనుకొంటున్నామని చెప్పారు.
రామ మందిర ప్రారంభోత్సవానికి గుర్తుగా నేపాల్‌ పలు ప్రత్యేక కానుకలను పంపనున్నదని స్థానిక మీడియా పేర్కొన్నది. ఇందులో వివిధ రకాల నగలు, సామగ్రి, బట్టలు, మిఠాయిలు ఉంటాయని మై రిపబ్లికా వార్తాపత్రిక తెలిపింది. వీటిని అందజేయడం కోసం జనక్‌పూర్‌ధామ్‌-అయోధ్యధామ్‌ ప్రయాణం జనవరి 18న ప్రారంభమవుతుందని, 20 నాటికి అయోధ్య చేరుకుంటుందని జానకి ఆలయ మహంత రామ్‌రోషణ్‌ దాస్‌ వైష్ణవ్‌ తెలిపారు. అదే రోజున కానుకలను రామ మందిర ట్రస్టుకు అందజేస్తామని పేర్కొన్నారు. గతంలో అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించే రాముడి విగ్రహాన్ని తయారు చేసేందుకు నేపాల్‌ కాళిగండకి నదీ తీరంలో సేకరించిన శాలిగ్రామ రాళ్లను అయోధ్యకు పంపిందని పత్రిక తెలిపింది. కాగా, ఆలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుభ్రతా పాథక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ భక్తులపై కాల్పులు జరిపించిన సమాజ్‌వాదీ పార్టీ నేతలకు ఆహ్వానాలు పంపొద్దని రామ మందిర్‌ ట్రస్టుకు లేఖ రాశారు.

Leave A Reply

Your email address will not be published.