తెలంగాణలో బీజేపీలో ఆధిపత్య పోరు… కమలానికి బిగ్ షాక్ తగలనుందా..?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణలో బీజేపీలో ఆధిపత్య పోరు నడుస్తున్న వేళ.. కమలానికి బిగ్ షాక్ తగలనుందా..సిట్టింగ్ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారా..పార్టీ కోసం అహర్నిశలు శ్రమించినా గుర్తింపు లేదని ఆవేదన చెందుతున్నారా..కొంత కాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇక భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధపడ్డారా..అంటే తాజా పరిణామాలను.. ఆ ఎమ్మెల్యే చేసిన ప్రకటన బట్టి చూస్తే ఇది అక్షరాలా నిజమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అసలే బీజేపీ గందరగోళ పరిస్థితులుదీనికి తోడురాష్ట్ర అధ్యక్షుడి మార్పుతెలుగు రాష్ట్రాల నుంచి పలువురు కీలక నేతలకు పదవులు కట్టబెడుతున్నారన్న పరిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నట్టుండి బాంబ్ పేల్చారు. దీంతో బీజేపీలో అసలేం జరుగుతోంది..పార్టీ బలోపేతం అవుతోందా లేకుంటే ఇంకేమైనా జరుగుతోందా..అని క్యాడర్ అయోమయంలో పడింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే.. ఎందుకింత రచ్చ..పార్టీ నుంచి ఆయన ఏం ఆశిస్తున్నారు..అనే విషయానికి వస్తే ..కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీలో ఒక్కసారిగా పెనుమార్పులు వచ్చేశాయ్.. అప్పటి వరకూ అదిగో.. ఇదిగో కేసీఆర్‌ను గద్దె దించేస్తున్నాం.. అని టైమ్ చెప్పి మరీ హడావుడి చేసిన కమలనాథులు ఒక్కసారిగా డీలా పడిపోయారు. ఈ క్రమంలోనే ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  మధ్య వర్గ విబేధాలు తలెత్తాయ్. దీంతో రెండు వర్గాలు చీలిపోయిన నేతలు రహస్య సమావేశాలు ఏర్పాటు చేయడం.. ఇదే సమయంలో ఈటల లేదా డీకే అరుణకు అధ్యక్ష పదవి ఇస్తారని వార్తలు రావడంతో ఒక్కసారిగా బీజేపీ నేతలు భగ్గుమన్నారు. అంతేకాదు.. బండికి కేంద్రంలో కీలక పదవి ఇస్తారని కూడా టాక్ నడిచింది. నాటి నుంచి నేటి వరకూ బండి పదవి, అధ్యక్షుడి మార్పుపై రోజుకో వార్త వస్తూనే ఉంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పోస్టు చేసిన వీడియోపై రచ్చ రచ్చ జరుగుతోంది. ఈ వ్యవహారం సద్దుమణగక ముందే.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతోన్నవారికి బీజేపీలో గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు.. కొంతకాలంగా పార్టీ కార్యాలయానికి దూరంగా.. సొంత నియోజకవర్గం దుబ్బాకలోనే ఉన్న ఆయన సడన్‌గా ఇలా కామెంట్స్ చేయడంతో ఏదో తేడా కొడుతోందని అందరూ అనుకుంటున్నారు.

గ్రూపురాజకీయాలకు చేస్తున్న వారికే హైకమాండ్ అండదండలు

బీఆర్ఎస్ ప్రభుత్వంపై (పోరాడుతున్న నాకు పార్టీ నుంచి ఎలాంటి సహకారం లేదు. గ్రూపురాజకీయాలకు చేస్తున్న వారికే హైకమాండ్ అండదండలు ఉన్నాయి. బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవి అడిగినా ఇంతవరకూ నాకు ఇవ్వలేదు. ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ తర్వాత ఫ్లోర్ లీడర్ పదవి ఖాళీగానే ఉంది. జాతీయ అధికార ప్రతినిధి లేదా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా అవకాశం వస్తుందని కనీసం రాష్ట్ర పార్టీలో అయినా తగిన ప్రాధాన్యత ఇస్తారని నేను భావిస్తున్నాను అని తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో చెప్పుకుని రఘునందన రావు తీవ్ర ఆవేదనకు లోనయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు.. ఇటీవల హైదరాబాద్ వచ్చిన జేపీ నడ్డాతో కూడా ఎమ్మెల్యే తన అసంతృప్తిని తెలియజేశారట. అయితే ఇంత జరిగిన తర్వాత అయినా తన రియాల్టీని గుర్తించి పార్టీ పెద్దలు పదవి ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారట. అయితే.. బీజేపీ అగ్రనేతల నుంచి తనకు ఎలాంటి పదవిగానీ గుర్తింపు లేకుంటే మాత్రం కీలక నిర్ణయమే తీసుకునే అవకాశం ఉందని రఘు అనుచరులు చెప్పుకుంటున్నారు. మరోవైపు.. పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించకుంటే తెలంగాణలో బీజేపీ పని ఖతమే అని ఎమ్మెల్యే అభిమానులు, ముఖ్య కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.దీనితో  ‘కమలంలో కల్లోల్లం’ రోజురోజుకూ పెరుగుతూనే ఉందే తప్ప ఈ గందరగోళ పరిస్థితులకు మాత్రం ఫుల్ స్టాప్ పడే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. ఇప్పటి వరకూ ఇతర పార్టీల నుంచి నేతలు అసంతృప్తి వెళ్లగక్కగా.. ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ, అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఇలా ఆవేదన వెలిబుచ్చారంటే పార్టీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రఘునందన్ డిమాండ్ మేరకు అధిష్టానం స్పందిస్తే సరే లేకుంటే బీజేపీకి గుడ్ బై చెప్పేసినా ఆశ్చర్య పోనక్కర్లేదేమో మరి..!.!

Leave A Reply

Your email address will not be published.