హిజాబ్ పిటిషన్ పై విచారణను తిరస్కరించిన  సుప్రీంకోర్టు   

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బ్యూరో చీఫ్: కర్ణాటక లోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో పరీక్షలకు హిజాబ్ ధరించి హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపేందుకు ప్రత్యేక ధర్మాసనాన్ని హోళీ సెలవుల తర్వాత ఏర్పాటు చేస్తామని చెప్పింది.ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించాలని కర్ణాటకలోని విద్యా సంస్థలకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై అత్యవసర విచారణ జరిపేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ తిరస్కరించారు. హోళీ పండుగ సెలవుల తర్వాత ఈ అంశంపై విచారణ జరిపేందుకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సెలవులు ముగిసిన వెంటనే ఈ పిటిషన్లను విచారణాంశాల జాబితాలో చేర్చుతానని చెప్పారు.మార్చి 8న హోళీ పండుగ కాగా, సుప్రీంకోర్టుకు మార్చి 6 నుంచి 12 వరకు సెలవులు. తిరిగి సర్వోన్నత న్యాయస్థానం కార్యకలాపాలు మార్చి 13న ప్రారంభమవుతాయి. కర్ణాటకలో పరీక్షలు మార్చి 9 నుంచి ప్రారంభమవుతాయి.పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది మాట్లాడుతూ, మార్చి 9 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని, అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ, ‘‘మీరు చివరి రోజున వస్తే నేనేం చేయగలను?’’ అని ప్రశ్నించారు. పిటిషనర్ల తరపున వాదిస్తున్న ఇతర న్యాయవాదులు మాట్లాడుతూ, గడచిన రెండు నెలల్లో రెండుసార్లు తాము విజ్ఞప్తి చేశామన్నారు.సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ, ‘‘నేను ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తాను. ఈ అంశాన్ని లిస్ట్ చేస్తాను’’ అన్నారు.న్యాయవాది మాట్లాడుతూ, ‘‘పరీక్షల సంగతి ఏమిటి’’ అన్నారు.సీజేఐ స్పందిస్తూ, ‘‘మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను’’ అన్నారు.కర్ణాటక ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడంపై నిషేధం విధిందని, దీనివల్ల హిజాబ్ ధరించి పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థినులను అనుమతించబోరని, వెంటనే తమ పిటిషన్లపై విచారణ జరపాలని సుప్రీంకోర్టును పిటిషనర్లు కోరుతున్నారు.2022 అక్టోబరులో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పులో ఓ న్యాయమూర్తి ప్రభుత్వ ఆదేశాలను సమర్థించగా, హిజాబ్ అనేది వ్యక్తిగత ఎంపిక అని, ఎంపిక చేసుకునే అవకాశాన్ని అణచివేయరాదని మరొక న్యాయమూర్తి చెప్పారు. దీంతో త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తానని సీజేఐ గతంలో చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.