ఇండియా పేరు మార్పుపై స్పందించిన ఐక్యరాజ్య సమితి..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇండియా పేరు మార్పుపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. పేర్ల మార్పుపై దేశాల నుంచి వచ్చిన అభ్యర్థనలను స్వీకరించి పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.ఈ సందర్భంగా గతేడాది టర్కీ తన పేరును తుర్కియేగా మార్చుకున్న విషయాన్ని ఐరాస ఉదహరించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ మాట్లాడుతూ.. తుర్కియే విషయంలో ఆ దేశ ప్రభుత్వం తమకు అందించిన అధికారిక అభ్యర్థనను స్వీకరించి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అదేవిధంగా ఏ దేశమైనా ఇలాంటి అభ్యర్థనలు పంపిస్తే వాటిని మేం పరిగణనలోకి తీసుకుంటాం అని స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు సిద్ధమైన వేళ.. ఇండియా పేరును భారత్‌గా మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు జ‌రిగే ఈ స‌మావేశాల్లో న‌రేంద్ర మోదీ స‌ర్కార్ ఇండియా పేరును మార్చే ప్రతిపాద‌న‌ను స‌భ్యుల ముందుంచ‌నుంద‌ని తెలుస్తోంది. రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా ఇండియా పేరును భార‌త్‌ గా మార్చే ప్రక్రియ‌ను కేంద్ర ప్రభుత్వం చేప‌డుతోందని.. ఇండియా పేరు మార్చుతూ స‌భ‌లో తాజా తీర్మానం ఆమోదించేందుకు మోదీ స‌ర్కార్ పావులు క‌దుపుతోంద‌ని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రప‌తి భ‌వ‌న్ నుంచి జీ20 ప్రతినిధుల‌కు అధికారిక స‌మాచారంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్ అని రాసిఉండ‌టం పేరు మార్పు ప్రతిపాద‌న‌కు బ‌లం చేకూరుస్తోంది.  ఇండియా పేరు మార్పు అంశం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈనెల 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే జీ20 సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన విందు ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా’ కు బదులుగా ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ అని ఉండటంతో ఈ అంశం కాస్తా తెరపైకి వచ్చింది. దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.