‘బండి’ని తొలగించారని యువనేత ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను తొలగించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. దీంతో అధిష్టానం బండి వర్గం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. ఇప్పటికే ఒకరిద్దరు ముఖ్య అనుచరులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే.. బండిని పదవి నుంచి తొలగించారని తీవ్ర మనస్థాపానికి గురై బీజేపీ ఖమ్మం అర్బన్ ఉపాధ్యక్షుడు, యువనేత గజ్జల శ్రీనివాస్ ఆత్మహత్యకు యత్నించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మాహత్యాయత్నం చేశారు. శ్రీనివాస్ కనిపించకపోవడంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా.. ఫ్యాన్‌కు వేలాడుతున్న అతడ్ని చూసి హుటాహుటిన స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నేతలు ఆస్పత్రికి చేరుకుని శ్రీనివాస్‌ను పరామర్శించి.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సమాచారం అందుకున్న బండి సంజయ్ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం శ్రీనివాస్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి బండి వెళ్తారని తెలుస్తోంది.

 ఇక సెలవు అన్నా..!

నాపేరు గజ్జల శ్రీనివాస్.. ఖమ్మం భారీతీయ జనతాపార్టీ అర్బన్ టౌన్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. బండి సంజయ్ అన్నను అధ్యక్ష పదవి నుంచి తొలగించడం నాకు బాధాకరం. నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అంతేకానీ నాకు ఎవరి మీదా కోపం కాదు. నేను అన్నమీద పెంచుకున్న ప్రేమతో ఆత్మహత్య చేసుకుంటున్నాను. జై బీజేపీ.. జై బండి సంజయ్ అన్నా.. ఇక సెలవు’ అని సూసైడ్ నోట్‌లో శ్రీనివాస్ రాశారు.

రాజీనామాల పర్వం!

ఇదిలా ఉంటే.. బండిని పదవి నుంచి తొలగించడాన్ని జీర్ణించుకోలేక బీజేపీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు మొరిశెట్టి నాగేశ్వరరావు రావు తన పదవికి రాజీనామా చేశారు. 2023లో బీజేపీ అధికారం చేపట్టాలని దృఢ సంకల్పంతో పనిచేసినటువంటి, ఒక సమయంలో మతోన్మాదులు సంజయ్‌ ఇంటిపై రాళ్లు రువ్వి భయబ్రాంతులకు గురిచేసినా అదరక, బెదరక రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారని రాజీనామా లేఖలో రాసుకొచ్చారు. బండి లాంటి నాయకుడు అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని.. ఆయన రాజీనామా తనను ఎంతో కలచివేసిందని అందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు లేఖలో నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.