వైసీపీ ఎంపీలు బిజెపిలో చేరుతారని జోరుగా ప్రచారం 

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్:  బీజేపీ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తొలుత ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని.. అయితే తాము వారిని చేర్చుకోమంటూ జూన్ నెల ప్రారంభంలో ఆదినారాయణరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఈ విషయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలలో ఎవరూ పార్టీ మారడం లేదంటూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అవన్నీ వట్టి పుకార్లేనని చెప్పారు. అయితే ఇప్పుడు మరో బీజేపీ నేత వైసీపీ ఎంపీల పార్టీ మార్పు అంశాన్ని ప్రస్తావించారు.

వైసీపీ ఎంపీలు బీజేపీలోకి చేరతారనే ప్రచారంపై ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీలను బీజేపీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీలు, కడప లోక్ సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీలు మిథున్ రెడ్డిలు.. బీజేపీలో చేరతారనే ప్రతిపాదన ఏదీ లేదని సోము వీర్రాజు తెలిపారు. అలాంటి ఆలోచన కూడా లేదని.. వైసీపీ ఎంపీలను చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను సోము వీర్రాజు తప్పుబట్టారు. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయంటూ వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు,

ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని సోము వీర్రాజు తెలిపారు. ఏపీకి నిధులు, ప్రాజెక్టులు వచ్చేలా బాధ్యతగా వ్యవహరిస్తుందని సోము వీర్రాజు చెప్పారు. సోము వీర్రాజు విషయానికి వస్తే.. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కన్నాముందు ఏపీ బీజేపీ చీఫ్‌గా వ్యవహరించారు. కన్నా లక్ష్మినారాయణ తర్వాత.. సోము వీర్రాజు ఏపీ బీజేపీ చీఫ్‌గా పనిచేశారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి పోటీచేసే ప్రయత్నం చేశారు. కానీ ఫలించలేదు.

Leave A Reply

Your email address will not be published.