యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ మరణించినట్లు కచ్చితమైన ఆధారాలు లేవు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వాగ్నర్‌ గ్రూప్‌ చీఫ్‌ యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ మరణించినట్లు కచ్చితమైన ఆధారాలు ఏమీ లభించలేదని బ్రిటన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండు రోజుల క్రితం రష్యా రాజధాని మాస్కోలో కుప్పకూలిన విమాన ప్రయాణికుల జాబితాలో ప్రిగోజిన్‌ పేరు ఉన్నట్లు తమకు సమాచారం లేదని వెల్లడించింది. కానీ, ఆ ప్రమాదంలో ఒకవేళ ఆయన చనిపోతే చనిపోయి ఉండవచ్చని అభిప్రాయపడింది.గత బుధవారం రష్యా రాజధాని మాస్కోలో ఓ విమానం కుప్పకూలింది. ఆ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులంతా ప్రాణాలు కోల్పోయారు. దాంతో ప్రమాదానికి గురైన విమానంలోని ప్రయాణికుల జాబితాలో వాగ్నర్‌ గ్రూప్‌ చీఫ్‌ యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ పేరు కూడా ఉన్నదని, ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడని రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రిగోజిన్‌ మరణానికి కచ్చితమైన ఆధారాలు లేవని బ్రిటన్‌ రక్షణ శాఖ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.కాగా, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో వాగ్నర్‌ గ్రూప్‌ కీలక పాత్ర పోషించింది. రష్యా సైన్యానికి మద్దతుగా ప్రిగోజిన్‌ ప్రైవేట్‌ సైన్యమైన వాగ్నర్‌ గ్రూప్ ఉక్రెయిన్‌ సైన్యంపై పోరాటం చేసింది. అయితే రెండు నెలల క్రితం రష్యాపై వాగ్నర్‌ గ్రూప్‌ తిరుగుబాటు చేసింది. ఆ తర్వాత బెలారస్‌ అధ్యక్షుడి జోక్యంతో ప్రిగోజిన్‌ బెలారస్‌ పారిపోయాడు. ఈ క్రమంలో ఆయన విమాన ప్రమాదంలో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.