నాంపల్లిలో అగ్ని ప్రమాదానికి కారణాలు ఇవే

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నాంపల్లిలోని బజారఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రసాయనాల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. నాలుగు అంతస్థుల భవనం మెుత్తం మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాద ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఘటనలో చిన్నారి సహా మెుత్తం ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఫైర్ డీజీపీ నాగిరెడ్డి వెల్లడించారు.గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన కెమికల్ డబ్బాలే అగ్ని ప్రమాదానికి కారణంగా ఆయన వెల్లడించారు. భవన యజమాని రమేష్ జైష్వాల్‌గా గుర్తించామని చెప్పారు. ఐదు అంతస్తుల భవనంలో భారీగా కెమికల్ డబ్బాలు నిల్వచేసినట్లు తెలిపారు. రమేష్ జైష్వాల్‌కి ప్లాస్టిక్ తయారు చేసే ఇండస్ట్రీ ఉందని.. ఆ ఇండస్ట్రీలో ఉపయోగించే కెమికల్ డబ్బాలను జనావాసాల మధ్య నిల్వ చేసినట్లు చెప్పారు. మెుత్తం 150కి పైగా కెమికల్ డబ్బాలను ఆ బిల్డింగ్‌లో నిల్వ ఉంచినట్లు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న కెమికల్ డబ్బాలో ఒకసారిగా అగ్నిప్రమాదం జరిగిందని.. ఆ తర్వాత బిల్డింగ్ మెుత్తం వేగంగా మంటలు వ్యాపించినట్లు చెప్పారు.భవనంలోని ఒకటి, రెండవ అంతస్థులో ఉన్న వాళ్లే మృత్యువాత పడ్డారని తెలిపారు. మూడు, నాలుగు అంతస్థుల్లో ఉన్నవాళ్లను క్షేమంగా రక్షించామన్నారు. మెుత్తం భవనంలో 21 మంది చిక్కుకోగా.. 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. మిగిలిన వారిని రక్షించామని… వారిలో 8 మంది అపస్మారకస్థితిలోకి వెళ్లినట్లు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు నాగిరెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం 10 మంది ఆసుపత్రిలో చికిత్స అందుతుండగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. భవనంలో డీజీల్, పెట్రోల్, ఆయిల్ వంటివి లేవన్నారు. కెమికల్ డబ్బాల కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు.చనిపోయింది వీరే: సమీన్, జాకీర్ హుస్సేన్, నిఖత్ సుల్తానా, మహ్మాద్ అజాం, హబీబుల్, రెహానా, ఫరీన్, మరో ఇద్దరి పేర్లు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.