భారత్ తో  మూడు యుద్ధాలు చేసిన తర్వాత తమకు బుద్ధి వచ్చింది

- పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత దేశంతో మూడు యుద్ధాలు చేసిన తర్వాత తమకు బుద్ధి వచ్చిందని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ చెప్పారు. కశ్మీరు వంటి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుని, ఇరు దేశాలు శాంతియుతంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దుబాయ్‌లోని ఓ అరబిక్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి షరీఫ్ ఇచ్చిన సందేశంలో, కశ్మీరులో జరుగుతున్నదానిని ఆపాలన్నారు. కశ్మీరులో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. పొరుగు దేశంతో శాంతిని కోరుకుంటున్నామన్నారు. ‘‘మనకు ఇంజినీర్లు, డాక్టర్లు, నిపుణులైన కార్మికులు ఉన్నారు. ఇరు దేశాలు అభివృద్ధి చెందేవిధంగా ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు, సౌభాగ్యం కోసం ఈ ఆస్తులను ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. శాంతియుతంగా జీవిస్తూ, అభివృద్ధి సాధించాలా? లేదంటే పరస్పరం కాట్లాడుకుంటూ వనరులను, సమయాన్ని వృథా చేసుకోవడమా? అనేది మనమే తేల్చుకోవాలి’’ అని చెప్పారు.భారత దేశంతో మూడు యుద్ధాలు చేశామని, వాటి వల్ల ప్రజలకు మరింత దుఃఖం, పేదరికం, నిరుద్యోగం వచ్చాయని అన్నారు. తాము గుణపాఠం నేర్చుకున్నామని, అయితే వాస్తవ సమస్యలను మనం పరిష్కరించుకోగలిగితే, శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నామన్నారు. బాంబులు, ఆయుధాల కోసం వనరులను వృథా చేయాలని తాము కోరుకోవడం లేదన్నారు. ఇరు దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలవేనని, యుద్ధం జరిగితే, ఏం జరిగిందో చెప్పడానికి ఎవరు మిగులుతారని ప్రశ్నించారు. ‘‘భారత దేశ నాయకత్వానికి, ప్రధాన మంత్రి మోదీకి నా సందేశం ఏమిటంటే, మనం ఓ చోట కూర్చుందాం. కశ్మీరు వంటి సలసల కాగుతున్న అంశాల పరిష్కారానికి నిజాయితీగా, శ్రద్ధగా చర్చించుకుందాం. శాంతియుతంగా జీవిస్తూ, అభివృద్ధి సాధించడమా? లేదంటే ఒకరితో మరొకరం పోట్లాడుకుంటూ వనరులను, సమయాన్ని వృథా చేసుకోవడమా? అనేది మనమే తేల్చుకోవాలి’’ అని షరీఫ్ అన్నారు.ఇదిలావుండగా, పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో చిక్కుకుంది. ప్రజల ప్రధాన ఆహారం అయిన గోధుమ పిండి అత్యధికులకు అందుబాటులో లేకుండా పోయింది. కొన్ని దుకాణాల్లో అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరోవైపు తెహరీక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్ అనే ఉగ్రవాద సంస్థ ఉగ్రవాద దాడులను పెంచింది. గత సంవత్సరం కాల్పుల విరమణకు చెల్లుచీటీ ఇచ్చింది.పాకిస్థాన్ ప్రధాన మంత్రి షరీఫ్ ఇప్పుడు శాంతి వచనాలు పలుకుతున్నప్పటికీ, ఐక్య రాజ్య సమితి సహా అన్ని వేదికలపైనా భారత దేశంపై దుష్ప్రచారం చేయడం పాకిస్థాన్‌కు అలవాటు. గత ఏడాది నవంబరులో ఐక్య రాజ్య సమితి సమావేశంలో కశ్మీరు గురించి పాకిస్థాన్ లేవనెత్తింది. దీనిపై భారత దేశం తీవ్రంగా మండిపడింది. తప్పుడు ప్రచారం చేయడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టింది. జమ్మూ-కశ్మీరు భారత దేశంలో అంతర్భాగమని, దానిని భారత్ నుంచి విడదీయడం సాధ్యం కాదని తెలిపింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత (గత ఏడాది డిసెంబరులో) పాకిస్థాన్ మంత్రి షాజియా మర్రి మాట్లాడుతూ, పాకిస్థాన్ వద్ద అణు బాంబు ఉందని భారత్ మర్చిపోకూడదని హెచ్చరించారు. ‘‘మా అణ్వాయుధ హోదా నిశ్శబ్దంగా ఉండటానికి కాదు. అవసరమైతే మేం వెనుకాడం’’ అని బెదిరించారు.

Leave A Reply

Your email address will not be published.