ఇదే నా అన్నకు నేను కట్టే చివరి రాఖీ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్; మాటలకందని విషాదం అది! తోడబుట్టిన అన్నాదమ్ముళ్లతో తమ పేగుబంధం కలకాలం నిలవాలని అక్కాచెల్లెళ్లు కోరుకునే పవిత్రమైన రాఖీ పండుగ నాడే ఓ చెల్లెలు.. తన అన్నకు తుది వీడ్కోలు పలకాల్సి వచ్చింది. దీంతో రక్షాబంధన్‌ నాడే ఇంతటి బాధను అనుభవించాల్సి వస్తుందని ఊహించలేదంటూ ఆ చెల్లెలు కన్నీరు మున్నీరుగా విలపించింది. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన అన్నకు.. చివరిసారిగా రాఖీ కట్టి గుండెలవిసేలా రోదించింది. ఈ హృదయ విదారక ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్టకు చెందిన చౌదరి కనుకయ్య సోమవారం గుండెపోటుతో మరణించాడు. అతని అంత్యక్రియలను మంగళవారం నిర్వహించాల్సి ఉంది. రాఖీ పండుగకు ఒక్క రోజు ముందే తన అన్న దూరం కావడంతో అతని చెల్లెలు గౌరమ్మ ఎంతగానో కుమిలిపోయింది. సోదరుడి మృతదేహానికి చివరిసారిగా రాఖీ కట్టి తన పేగుబంధాన్ని చాటుకుంది. ఇదే నా అన్నకు నేను కట్టే చివరి రాఖీ.. వచ్చే ఏడాది నుంచి రాఖీ కట్టేందుకు నా అన్న ఉండడు అంటూ గుండెలవిసేలా విలపించింది. చెల్లెలు గౌరమ్మ రోదన చూసిన వాళ్లందరినీ దుఃఖ సాగరంలో ముంచేసింది.

Leave A Reply

Your email address will not be published.