నాడు నేడు కులం పేరుతో సమాజాన్ని చీల్చుతున్నారు

భారత ప్రధాని నరేంద్ర మోడీ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలోనూ.. మోదీ తన మాటల అస్త్రాన్ని ప్రయోగించారు. కాంగ్రెస్‌ని టార్గెట్ చేసుకొని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘అభివృద్ధి వ్యతిరేకులకు ఈ దేశం ఆరు దశాబ్దాల సమయం ఇచ్చింది. కానీ మేము అధికారంలోకి వచ్చి కేవలం 9 సంవత్సరాలే అవుతోంది. తొమ్మిదేళ్లలోనే ఇంత పని చేయగలిగినప్పుడు, 60 ఏళ్లు చేసి ఉంటే ఈ దేశం ఇంకెలా ఉండేది. కానీ.. వాళ్లు 60 ఏళ్ల సమయమిచ్చినా ఏం చేయలేకపోయారు. ఇది వారి వైఫల్యం. అప్పుడు వాళ్లు పేదవాళ్ళ భావోద్వేగాలతో ఆడుకునేవారు. ఈరోజు కూడా అదే ఆట ఆడుతున్నారు. అప్పుడు కులం పేరుతో సమాజాన్ని చీల్చేవారు, నేడు కూడా అదే పాపం చేస్తున్నారు. అప్పుడూ అవినీతిలో కూరుకుపోయారు, నేడు కూడా తీవ్ర అవినీతికి పాల్పడుతున్నారు’’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.కాంగ్రెస్‌ దురహంకార కూటమి నేతలు మహిళలపై ఎలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారో మనం రోజూ చూస్తూనే ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు. మహిళలకు హక్కులు దక్కాలని వీళ్లు కోరుకోవడం లేదని.. అందుకే వీళ్లు కులం, మతం పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఒక్క రోజులో తమ ప్రభుత్వం చేసినన్న ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన పనులు ఏ ఇతర ప్రభుత్వాలు ఒక్క ఏడాదిలో చేయలేవని అన్నారు. కొత్త ఆలోచనలు, అభివృద్ధికి రోడ్ మ్యాప్ లేని వ్యక్తుల వల్ల మధ్యప్రదేశ్‌ ఎప్పుడూ అభివృద్ధి చెందనని పేర్కొన్నారు. దేశ ప్రగతిని ద్వేషించడమే వారి ఏకైక లక్ష్యమని.. వారి ద్వేషంతో దేశం సాధించిన విజయాలను కూడా మర్చిపోతారంటూ మోదీ విమర్శలు గుప్పించారు.ఇదే సమయంలో ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రస్తావించారు. ‘‘ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వెళ్లాయి. లోక్‌సభ, అసెంబ్లీలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తప్పుడు వాగ్దానాలు చేసి, మహిళలను పదే పదే ఓట్లు అడిగారు. కానీ.. పార్లమెంట్‌లో కుట్రలు చేసి చట్టం చేయకుండా అడ్డుకున్నారు. కానీ.. ఈ మోదీ హామీ ఇచ్చినట్టు నేడు ‘మహిళా శక్తి చట్టం’ వాస్తవరూపం దాల్చింది’’ అని మోదీ చెప్పుకొచ్చారు. కాగా.. తన ప్రసంగానికి ముందు ప్రధాని మోదీ రాష్ట్రానికి రూ.19,000 కోట్లకు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

Leave A Reply

Your email address will not be published.