హజ్ యాత్రలో విషాదం .. 645 మంది మృతి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది 600 మందికిపైగా యాత్రికులు మరణించారు. ఈ మేరకు సౌదీ అరేబియా అధికార వర్గాలు వెల్లడించాయి. మొత్తం 68 మంది భారతీయులు సహా 645 మంది యాత్రికులు మృతిచెందినట్టు పేర్కొన్నాయి. వీరిలో అత్యధికంగా 300 మంది ఈజిప్టు వాసులు ఉండటం గమనార్హం. అత్యధిక ఉష్ణోగ్రతలు, ఉక్కబోత వాతావరణం వల్ల పెద్ద సంఖ్యలో యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపాయి. మక్కాలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరడంతో వృద్ధులు వేడికి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరై చనిపోతున్నారు.ఈ ఏడాది హజ్ యాత్రకు దాదాపు 18.3 లక్షల మంది వచ్చారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని హజ్‌ నిర్వాహకులు వెల్లడించారు. వివిధ కారణాలతో చనిపోయిన యాత్రికులు మృతదేహాలను మక్కాలోని అల్-ముయిసెమ్‌ ఆసుపత్రిలో భద్రపరిచామని, సంబంధీకులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. అటు, తమ దేశం నుంచి హజ్ యాత్రకు వెళ్లిన చాలా మంది ఆచూకీ తెలియరాలేదని, వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టామని ఈజిప్టు ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది.మృతుల్లో అత్యధికంగా 300 మంది ఈజిప్టువాసులు కాగా.. తర్వాతి 68 మంది భారతీయుల, 60 మంది జోర్డాన్‌వాసులు ఉన్నారు. ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్, ట్యూనీషియా, ఇరాక్, కుర్దిష్ రీజియన్‌కు చెందిన వాళ్లు చనిపోయారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మూడు రెట్లు అధికంగా ప్రాణాలు కోల్పోయారు. గతేడాది 240 మరణాలు నమోదుకాగా.. వీరిలో ఇండోనేషియాకు చెందినవారే అధికం.ఉష్ణోగ్రతల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని హజ్ నిర్వహకులు పలు ఏర్పాట్లు చేశారు. గొడుగులు వాడాలని, ఎప్పటికప్పుడు తగినంత నీరు తాగాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. యాత్రికులపై నీళ్లు స్ప్రే చేయడానికి వాలంటీర్లను నియమించారు. అయినప్పటికీ.. పెద్ద ఎత్తున మరణాలు చోటుచేసుకోవడం గమనార్హం.కాగా, ఒక్క ఆదివారం రోజే సౌదీలో 2,700 కంటే ఎక్కువ వడదెబ్బ కేసులను నివేదించినప్పటికీ.. మరణాలపై సమాచారం వెల్లడించలేదు. హజ్ యాత్రలో భారతీయుల మరణాలను ధృవీకరించిన దౌత్యవేత్త.. ఖచ్చితమైన సంఖ్యను వెల్లడించడానికి నిరాకరించారు.

Leave A Reply

Your email address will not be published.