టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారం .. పోలీసులకు షాక్ ఇచ్చిన హైకోర్టు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించిన కేసులో పోలీసులకు ఎదురు దెబ్బ తగిలింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా కోర్టులో పోలీసులకు చుక్కెదురైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నిందితుల రిమాండ్ ను ఏసీబీ కోర్టు కొట్టివేయడాన్ని సమర్థించింది. లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఈ కేసులో రిమాండ్ చేసే అధికారం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. సైబరాబాద్ పోలీసులు వేసిన పిటిషన్ ను తోసిపుచ్చిన హైకోర్టు అవినీతి కేసులలో శాంతిభద్రతల పోలీసులకు రిమాండ్ చేసే అధికారం లేదని గుర్తు చేసింది. నిందితుల అరెస్టులో ఏసీబీ ప్రొసీజర్ ఫాలో కాలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే పోలీసుల పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది.
ఇక ఇప్పటికే నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు అవినీతి నిరోధక శాఖ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి, రిమాండ్ విధించాలని కోరగా ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో సరైన ఆధారాలు లేవని పేర్కొంది. నిందితులకు 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశించిన కోర్టు, నోటీసులు ఇచ్చిన తర్వాతే విచారించాలని సూచించింది. ఇక ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడానికి నిరాకరించటంతో హై కోర్టు మెట్లెక్కిన తెలంగాణ పోలీసులకు మరోమారు చుక్కెదురైంది. హైకోర్టు కూడా నిందితులకు రిమాండ్ విధించి, కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది. కాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు , పైలెట్ రోహిత్ రెడ్డిలు పార్టీ మారటానికి డబ్బులు, కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభపెట్టి పార్టీ మార్చటానికి ప్రయత్నం చేశారని ఫిర్యాదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అన్ని ఆధారాలు ఉన్నాయని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి ఆడియో లీకులు కూడా కలకలంగా మారుతున్నాయి. ఈ రోజు కూడా కొన్ని ఆడియో లీకులు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ కేసులో అనేక కీలక మలుపులు చోటు చేసుకుంటున్న క్రమంలో ఆధారాలు ఉన్నాయని చెప్తున్నా తెలంగాణా ప్రభుత్వానికి వరుసగా కోర్టుల్లో చుక్కెదురు కావటం ఆసక్తిగా మారింది.

Leave A Reply

Your email address will not be published.