దేశవ్యాప్తంగా ఆందోళన బాట పట్టిన ట్రక్ డ్రైవర్లు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: దేశ వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. హిట్ అండ్ రన్ కేసులో ప్రస్తుతం ఉన్న శిక్షను, జరిమానాను భారీగా పెంచడం ఈ నిరసనలకు కారణం అయింది. ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేస్తుండటంతో సరఫరాలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే ట్రక్కులు కూడా నిలిచిపోవడంతో ఎక్కడ ఇంధన కొరత ఏర్పడుతుందోనని వాహనదారులు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే పెట్రోల్ బంకుల ముందు క్యూ కడుతున్నారు. దీంతో పెట్రోల్ బంక్‌ల వద్ద భారీగా ట్రాఫిక్ ఏర్పడుతోంది.కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భారత న్యాయ సంహిత చట్టంలో హిట్‌ అండ్‌ రన్‌ కేసులకు సంబంధించి కఠిన నిబంధనలు చేర్చడంతో దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. అయితే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ట్రక్కు డ్రైవర్లు రాస్తారోకోలు, ర్యాలీలతో రోడ్లపైకి చేరుకుంటున్నారు. అయితే ట్రక్కు డ్రైవర్ల నిరసనతో పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే ట్యాంకర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఇంధన కొరత ఏర్పడుతుందనే భయాలు నెలకొన్నాయి. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్‌ బంక్‌లకు పోటెత్తుతున్నారు.మహారాష్ట్ర, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, జమ్మూ కాశ్మీర్‌, లద్దాఖ్‌ వంటి రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల ముందు భారీగా వాహనాలు క్యూ కట్టాయి. కొన్ని చోట్ల అయితే బంకుల వద్ద వందల మీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి. వీటికి సంబంధించిన వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారుతున్నాయి. ట్రక్కు డ్రైవర్ల ఆందోళనలతో కొన్ని ప్రాంతాల్లో వంట గ్యాస్ సిలిండర్లు సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. అయితే ట్రక్కు డ్రైవర్ల ఆందోళనల కారణంగా ఇంధన సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చాలా రాష్ట్రాలు అనేక ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నాయి.అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన భారత న్యాయ సంహిత చట్టంలోని నిబంధన ప్రకారం.. హిట్ అండ్ రన్ కేసుల్లో పదేళ్ల జైలు శిక్ష, రూ.7 లక్షల వరకు ఫైన్ వేయనున్నట్లు కొత్త నిబంధన తీసుకువచ్చింది. రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన జరిగిన తర్వాత దాని గురించి పోలీసులకు చెప్పకుండా పారిపోతే గరిష్ఠంగా ఈ శిక్ష విధించాలని చేర్చారు. అయితే ఈ కొత్త నిబంధనపై ట్రక్కులు, లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.