ప్రయాణికులకు చేరువ‌య్యేందుకు టీఎస్ ఆర్టీసీ మ‌రో ముంద‌డుగు

-  గ‌మ్యం యాప్‌ను ఆవిష్క‌రించిన ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు మ‌రింత చేరువ‌య్యేందుకు టీఎస్ ఆర్టీసీ మ‌రో ముంద‌డుగు వేసింది. సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకుని అత్యాధునిక ఫీచ‌ర్ల‌తో బ‌స్ ట్రాకింగ్ యాప్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌న‌కు గ‌మ్యం అని నామ‌క‌ర‌ణం చేశారు. ఎంజీబీఎస్ ప్రాంగ‌ణంలో ఎండీ వీసీ స‌జ్జ‌నార్ ఆర్టీసీ ఉద్యోగుల‌తో క‌లిసి గ‌మ్యం యాప్‌ను ఆవిష్క‌రించారు.ఈ సంద‌ర్భంగా స‌జ్జ‌నార్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వంలో విలీనం చేసిన సీఎం కేసీఆర్‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌కు కూడా సంస్థ త‌ర‌పున ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని సంస్థ స్వాగతిస్తూ.. రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించగలమనే విశ్వాసం తమ‌కుందన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌తి రోజు 45 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణికుల‌ను వారి వారి గ‌మ్య‌స్థానాల‌కు చేరుస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఇటీవ‌లే 776 కొత్త బ‌స్సుల‌ను ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని చెప్పారు.ఇకపై బస్సు ఎక్కడుందో, ఎప్పుడొస్తుందో అని వేచిచూడాల్సిన అవసరం లేదని, అత్యాధునిక ఫీచర్లు గల ‘గమ్యం’ యాప్ తో ఆర్టీసీ బస్సు మన వద్దకు రావడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. ప్ర‌స్తుతం 4,170 బ‌స్సుల‌కు ట్రాకింగ్ స‌దుపాయం క‌ల్పించాం. హైద‌రాబాద్‌లో పుష్ప‌క్ ఎయిర్‌పోర్టు, మెట్రో ఎక్స్‌ప్రెస్ స‌ర్వీసుల‌కు, జిల్లాల్లో ప‌ల్లె వెలుగు మిన‌హా అన్ని బ‌స్సుల‌కు ట్రాకింగ్ సదుపాయం క‌ల్పించామ‌న్నారు. అక్టోబ‌ర్ నుంచి మిగ‌తా బ‌స్సుల‌కు కూడా ఈ స‌దుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామ‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.