తునిలో రైలు దహనం కేసు కొట్టివేత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తునిలో రైలు దహనం కేసుకు సంబంధించి గడిచిన ఐదేళ్లుగా విచారణ జరుపుతున్న విజయవాడ రైల్వేకోర్టు ఈ రోజు ఆ కేసును కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో.. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏపీ మంత్రి దాడిశెట్టి రాజాతో పాటు కాపు నేత ముద్రగడ పద్మనాభానికి భారీ ఊరట లభించినట్లుగా చెప్పాలి. ఈ కేసు తీర్పు సందర్భంగా రైల్వే కోర్టు  కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుపై ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులు సరిగా విచారణ చేయలేదని పేర్కొంది. సున్నితమైన అంశాలపై ఐదేళ్లు ఎందుకు సాగదీశారని ప్రశ్నించిన కోర్టు.. దర్యాప్తు సరిగా జరగలేదన్న వ్యాఖ్యలు చేసింది. అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కాపులకు ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్ల హామీ అమలు కాలేదని ఆరోపిస్తూ అప్పట్లో ముద్రగడ పద్మనాభం ఛలో తునికి పిలుపునివ్వటం తెలిసిందే. పోలీసులు అడ్డుకోవటంతో హింసాత్మకంగా మారింది.చివరకు ఆ వైపు వెళుతున్న రత్నాచల్ ఎక్స్  ప్రెస్ ను అడ్డుకున్న ఆందోళనకారులు.. రైలును నిప్పు అంటించారు. అప్పట్లో ఈ ఉదంతం రెండు తెలుగురాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. ఈ కేసులో వైసీపీ నేతలు దాడిశెట్టి రాజా.. మాజీ మంత్రి ముద్రగడతో పాటు 41 మంది నేతలపై విచారణ చేపట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా వీరు పలుమార్లు రైల్వే కోర్టుకు హాజరయ్యారు. చివరకు ఈ కేసునురైల్వే కోర్టు కొట్టేసింది. సరైన సాక్ష్యాలు లేని కారణంగా కేసును కొట్టేసినట్లుగా పేర్కొన్నారు.గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న వేళలో కాపు రిజర్వేషన్ల సాధనలో భాగంగా సాగిన పోరుతో తునిలో రైలు దహనం చోటుచేసుకోవటం.. ఆ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా తునిలో అల్లరిమూకలు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలుకు నిప్పు పెట్టటం.. ఆ సందర్భంగా రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయంతో పరుగులు తీయటం.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు తీవ్ర సంచలనంగా మారటం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.