టీ కాంగ్రెస్ లో కల్లోలం.. మరో ఆరు మాసాల్లో ఎన్నికలు.. కిం కర్తవ్యం!!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వివాదాలు ఎక్కడా సర్దుమణగడం లేదు. ముఖ్యంగా ఇంతింతై.. అన్నట్టుగా ఎదుగుతున్న పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి రాజకీయాలను  సీనియర్లు అస్సలు సహించలేక పోతున్నారు. దీంతో పార్టీలో అదే కల్లోలం కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రేవంత్ రెడ్డికి ఇతర నాయకులకు మధ్య సఖ్యత ఇంకా ముడిపడలేదని అంటున్నారు పరిశీలకులు. దీంతో ఇప్పట్లో అంతర్గత విభేదాలు సర్దుమణిగే అవకాశాలైతే కనిపించడం లేదని చెబుతున్నారు.పైకి అందరూ కలిసి ఉన్నట్లే కనిపించినా.. సందర్భాన్ని బట్టి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను ఒక వర్గం నాయకులు అడ్డుకుంటూ వస్తున్నారు. దాంతో ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా పార్టీ తీరు కనిపిస్తోంది.మరోవైపు.. ఐదారు నెలల్లోనే తెలంగాణ ఎన్నికలు వున్నాయి. ఓవైపు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క.. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. క్షేత్రస్థాయిలో పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు పార్టీ బలోపేతానికి కారణం అవుతోందని భావిస్తున్నారు.ప్రజా సమస్యలపై పోరాటం నిరుద్యోగ సమస్యపై ఉద్యమం వంటివి పార్టీకి నూతనోత్సాహం ఇచ్చాయనే చెప్పుకోవాలి. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్ర నాయకత్వం ముందుకు వెళ్తోంది.దీంతో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రజల నుంచి ఆదరణ లభిస్తున్నా.. నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం.. అంతర్గత కుమ్ములాటలు.. పార్టీకి కంట్లో నలుసులా మారాయి. నిరుద్యోగ నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెండు రోజుల కిందట ప్రకటించారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేతో చర్చించిన తర్వాత ప్రకటన చేశారు.అయినప్పటికీ.. స్థానిక నాయకత్వానికి సమాచారం ఇవ్వకపోవడంతో పీసీసీ ప్రకటనపై పార్టీలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే నల్గొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో 21వ తేదీన నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన కార్యక్రమంపై నల్గొండ భువనగిరి ఎంపీలు.. ఉత్తమ్కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతర వ్యక్తం చేశారు. ఇది తాజాదే అయినా.. ఇలాంటివి చాలానే ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఎన్నికల నాటికైనా ఇవి సర్దుకుంటాయో లేదో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.