పాపం.. షాంపూ కారణంగా నిలిచిన పెళ్లి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/అస్సాం:  అతిథి మర్యాదలు సరిగ్గా లేవని, అందరి ముందూ వరుడు ముద్దు పెట్టుకున్నాడని, విందులో నాన్-వెజ్ పెట్టలేదని, ఊరేగింపులో అబ్బాయి నాగినీ డ్యాన్స్ చేశాడని ఇలా చిత్ర విచిత్రమైన కారణాలతో వివాహాలు రద్దుచేసుకున్న ఘటనలు ఇటీవల కాలంలో దేశంలోని పలుచోట్ల జరుగుతున్నాయి. తాజాగా, అలాంటి విచిత్రమైన కారణంతోనే మరో పెళ్లి ఆగిపోయింది. ఓ చిన్న షాంపూ పెళ్లినే ఆపేసిందంటే నమ్ముతారా? అవును.. అసోంలో ఇదే జరిగింది. సంప్రదాయం ప్రకారం వధువుకు వరుడి కుటుంబం అందజేసే కానుకల్లో చౌకరకం షాంపూ ఉండటమే కారణం. దీనిపై అబ్బాయికి పెళ్లి కుమార్తె వెటకారంగా వాట్సాప్ మెసేజ్ పెట్టడంతో అతడి మనస్సు చివుక్కుమంది. దీంతో తాను ఆ అమ్మాయిని చేసుకోను గాక చేసుకోనని ఖరాఖండీగా చెప్పేశాడు.బార్పెటా జిల్లాలోని హౌలీ ప్రాంతానికి చెందిన యువతి ధిరా దాస్‌కు గువాహటిలోని దివ్యజోతి తాలూక్‌దార్ అనే ఇంజినీర్‌‌తో పెళ్లి నిశ్చయమైంది. డిసెంబరు 15న వివాహానికి ముహూర్తంగా నిర్ణయించారు. అయితే, వివాహానికి ముందు రోజు వధువుకి కొన్ని కానుకలను అత్తింటివారు పంపడం అక్కడ సంప్రదాయం. ఈ నేపథ్యంలో డిసెంబరు 14న వరుడి కుటుంబం వధువుకు బహుమతులు, ఇంట్లోకి ఉపయోగపడే వస్తువులను పంపింది. అయితే, వాటిలో తక్కువ ఖరీదైన షాంపూ బాటిల్ ఉందని వధువు కాబోయే భర్తపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘నీ స్థాయి ఇంతేనా?’ అంటూ కోపంతో అదే రోజు రాత్రి వాట్సప్‌ మెసేజ్ పెట్టింది. దీంతో విస్తుపోయిన యువకుడు.. మర్నాడు ఉదయం జరగాల్సిన వివాహాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. విషయం తెలిసి అమ్మాయి తరఫువారు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. యువతిని క్షమించి, వివాహం జరిగేలా చూడాలని కోరారు. వారి ప్రయత్నాలు నిష్ప్రయోజనం కావడంతో చివరకు వ్యవహారం పోలీసుల వద్దకు చేరింది.జురూన్ వేడుకలో సరైన విందు పెట్టలేదని వరుడి తరపు వారు గొడవకు దిగారని, అబ్బాయి కుటుంబం కట్నం డిమాండ్ చేశారని వధువు తరఫువారు ఆరోపిస్తున్నారు. అయితే, ‘వరుడి కుటుంబం ఆమెకు సమర్పించిన బట్టలు, ఆభరణాలతోపాటు వస్తువులు అన్నీ చౌకబారువని, అలాంటివి ఎవరూ కొనుగోలు చేయరని తూలనాడింది.. కనీసం నిరాశ్రయులైన వారు కూడా అలాంటి దుస్తులను వేసుకోరని దెప్పిపొడించింది.. వరుడి ఉద్యోగాన్ని కూడా కూడా కించపరిచింది..’ అని అబ్బాయి తరఫు మహిళ తెలిపింది.‘‘మేము పంపిన బట్టలు, కానుకలకు ఆమెను నచ్చలేదని నాకు మెసేజ్ చేసింది. బట్టలు, ఇతర బహుమతులు ఆమెకు తగిన గౌరవం, ప్రేమతో అందించేవి. ఆ వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు మా సోదరి కూడా ఆమెతో సంప్రదించింది. అంతేకాకుండా బహుమతులకు సంబంధించినంత వరకు ఒకరు డిమాండ్ చేయలేరు. నేను ఆమె పెట్టిన మెసేజ్‌లు నా తల్లిదండ్రులకు చూపించాను’’ అని వరుడు వివరణ ఇచ్చాడు.

Leave A Reply

Your email address will not be published.