23 నుంచి రంగనాధస్వామి దేవస్థానంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: పాతబస్తీ జియాగూడలోని చారిత్రాత్మక రంగనాథస్వామి దేవస్థానంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను ఈనెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు కార్పొరేటర్లు బోహిని దర్శన్, శంకరాయాదవ్, లాల్సింగ్, ఆలయ ట్రస్టీ ఎస్ టి చారి, నిర్వాహకులు శేషాచార్యులు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశంలో భాగంగా వారు వైకుంఠ ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్లను, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు బోహిని దర్శన్, శంకరాయాదవ్లు మాట్లాడుతూ వైకుంఠ ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వం తరపున ఆలయం వద్ద బారికేడ్లను, క్యూలైన్లను, నిరంతర విద్యుత్ సరఫరాను, భక్తులకు అసౌకర్యం కలుగకుండా తాగునీరు, అత్యవసర వైద్య శిబిరం, అంబులెన్స్లను అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. దేవాదాయ శాఖ తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు ఎస్.టి. చారి, శేషాచార్యులు, బద్రినాథాచార్యులు మాట్లాడుతూ శ్రీరంగం తరహాలో తెలంగాణాలో ప్రఖ్యాతిగాంచిన జియాగూడ రంగనాథస్వామి దేవస్థానంలో వైకుంఠ ఉత్సవాలే ప్రధాన ఉత్సవాలుగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తిరుమల తిరుపతి తరహాలో ఈసారి కూడా ఈనెల 23వ తేదీ శనివారం తెల్లవారుజామున మూల విరాట్కు అభిషేకం, అలంకరణ, తోమాల సేవ, తిరుప్పావై సేవాకాలము, బాలభోగ నివేదనము, మంగళాశాసనము ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం 5గంటలకు ఉత్తర ద్వారం నుంచి గరుడ వాహనంపై రంగనాథుడు ఆలయం వెలుపల, పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తాడని వివరించారు. గరుడ వాహనసేవలో ఊరేగిన తర్వాత స్వామివారిని ఉదయం 7గంటల నుంచి ఆలయంలో ఉత్తర ద్వారంలో ప్రతిష్ఠించి భక్తులను క్యూలైన్లుగా అనుమతిస్తూ స్వామివారి దర్శన సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఈనెల 27వ తేదీ వరకూ వరుసగా ఐదు రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ఈనెల 27న సాయంత్రం 6గంటల నుంచి నమ్మాళ్వార్ పరమపద ఉత్సవం ఉంటుందని వారు వివరించారు ఇందుకోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడం జరుగుతుందని, సప్తద్వారాల ద్వారా స్వామివారి దర్శనం పొందే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కుల్సుంపురా సీఐ అశోక్ కుమార్, సేవకులు డి.వి.ఎస్.రాజు, భాజపా నాయకులు రాజేందర్, లక్ష్మీనారాయణ, ఆర్. ప్రేమ్కుమార్, బొట్టు రామ్, భారాస నేతలు సందీప్, జలమండలి, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బి, విద్యుత్, దేవాదాయ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.