పల్లె ప్రగతి తోనే గ్రామాలు అభివృద్ధి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: పల్లె ప్రగతితోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం నంబర్‌ వన్‌గా నిలిచిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా గొల్లూరు గ్రామంలో రూ.60 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు పనులు, గ్రామ పంచాయతీ భవనం నిర్మాణ దాత చెలసాని బాల రామయ్య ప్రసాద్‌ కట్టించిన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో పేదలకు ఇండ్ల పట్టాలను జడ్పీ చైర్‌ పర్సన్‌ తీగల అనితా హరినాథ్‌రెడ్డితో కలిసి ఆమె పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని చెప్పారు. అర్హులైన వారందరికి గృహలక్ష్మి కింద రూ.3 లక్షలను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుందన్నారు. త్వరలోనే పేద ప్రజల సొంతింటి కళను నెరవేరుస్తామని ఆమె ప్రజలకు తీపి కబురు అందించారు. గ్రామాల అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని అన్నారు. గొల్లూరు గ్రామంలో 130 మందికి ఇండ్ల పట్టాలు కావాలని జాబితాను సిద్ధం చేయగా 80 మందికి ప్రస్తుతం పంపిణీ చేశామని పేర్కొన్నారు.మిగతా వారికి త్వరలోనే పంపిణీ చేస్తామని ఆమె తెలిపారు. రాష్ట్రం ఏర్పడక ముందు గ్రామాలు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రజలు ఆలోచించాలన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని వివరించారు. మహేశ్వరం నియోజక వర్గం అభ్యర్థిగా నన్ను నిలబెట్టినందుకు ప్రజలందరు ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ సునితా ఆంధ్యానాయక్‌, సహకార బ్యాంక్‌ చైర్మన్‌ మంచె పాండు యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అద్యక్షుడు అంగోతు రాజునాయక్‌, వర్కింగ్‌ ప్రసిడెంట్‌ వర్కల యాదగిరి గౌడ్‌, గ్రామ సర్పంచ్‌ మంద కవిత కుమార్‌, ఎంపీటీసీ నడికూడి రమేశ్‌ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.