వివేకానందరెడ్డి హత్యకేసు అప్రూవర్‌ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు లో అప్రూవర్‌ గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకేసులో మరికొన్ని రోజుల్లో నిజాలు తెలనున్నాయని, నిజాలు బయటపడే రోజుదగ్గర పడిందన్నారు. ఇంతకాలం దస్తగిరి చెప్పింది అబద్దమని అని కొందరు అన్నారని.. తాను చెప్పిన నిజాలు ఏమిటో ఇక తెలుస్తాయన్నారు.

ఇటీవల కొందరిని సీబీఐ అధికారులు విచారించారంటే సమాచారం ఉంటేనే కదా విచారణకు పిలిచి ఉంటారని దస్తగిరి అన్నారు. రాష్ట్రంలో విచారణకు సీఎం జగన్ సహకరించి ఉంటే పది రోజుల్లో కేసు పూర్తి అయ్యేదన్నారు. తెలంగాణకు కేసు బదిలీ చేయడం మంచిదేనన్నారు. హైదరాబాద్ కోర్టుకు హాజరయ్యేందుకు సమన్లు తీసుకునేందుకు సీబీఐ ఎదుటకు వచ్చానని దస్తగిరి పేర్కొన్నారు.కాగా వివేకా హత్య కేసుపై సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. సీబీఐ కోర్టు  ఆదేశాల మేరకు నిందితులందరికీ సమన్లు జారీ చేశారు. ఈనెల 10వ తేదీన హాజరుకావాలని హైదరాబాద్‌ సీబీఐ కోర్టు ఆదేశించింది. దీంతో చార్జిషీట్‌లోని ఐదుగురు నిందితులకు ఈ మేరకు సమన్లు జారీ చేశారు. కడప సెంట్రల్ జైలులో ఉన్న సునీల్‌, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డిలకు సమన్లు జారీ అయ్యాయి. అలాగే అప్రూవర్‌గా మారిన ఏ4 నిందితుడు దస్తగిరికి సీబీఐ అధికారులు సమన్లు అందజేయనున్నారు. నిన్న సీబీఐ ఎదుటహాజరైన ఏ1 నిందితుడు ఎర్రగంగిరెడ్డి సమన్లు అందుకున్నాడు.కాగా వివేకా హత్య కేసులో విచారణ ఎదుర్కొన్న సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణ మోహన్‌ రెడ్డి  సతీమణి భారతి వద్ద సహాయకుడిగా పనిచేసే నవీన్‌‌ను సీఎస్ కంటికి రెప్పలా కాపాడుకుంటూ రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి శుక్రవారం కడప జిల్లా సింహాద్రిపురం మండలం భానుకోటలో పార్వతీ సమేత సోమేశ్వరాలయ పునరుద్ధరణ వేడుకల్లో వైఎస్‌ అవినాశ్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమం ముగించుకుని సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో కడప సెంట్రల్‌ జైలు మీదుగా సీఎస్‌ రేణిగుంటకు బయల్దేరారు. ఆ తర్వాత ఐదు నిమిషాలకే… కృష్ణమోహన్‌ రెడ్డి, నవీన్‌ల విచారణ ముగిసింది. అక్కడి నుంచి కొద్దిదూరంలో సీఎస్‌ వేచి చూస్తుండగా… ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఇద్దరూ కలిసి ఒకే వాహనంలో రేణిగుంటకు, అక్కడి నుంచి విమానంలో విజయవాడకు వెళ్లినట్లు తెలిసింది. వీరితో పాటు నవీన్ కూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈ పరిణామాలన్నీ నిశితంగా పరిశీలిస్తే.. ఏపీ సీఎస్ వ్యవహారశైలిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ సొంత బాబాయ్ హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులను వెంటబెట్టుకుని మరీ తాడేపల్లికి సీఎస్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వైఎస్ వివేకా హత్య రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. అలాంటి కీలక హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులను కడప నుంచి తాడేపల్లికి తరలించేంత ఖాళీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉండటం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ప్రభుత్వంలో పాలనాపరంగా ముఖ్యమంత్రి తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదే కీలక పాత్ర. ప్రభుత్వపరంగా సీఎం తీసుకునే ప్రతీ నిర్ణయం అమలులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రమేయం తప్పనిసరిగా ఉంటుంది. అలాంటి స్థానంలో ఉన్న జవహర్ రెడ్డి.. సీఎం సతీమణి భారతి అటెండర్‌ నవీన్ కోసం, సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డి కోసం వేచి ఉండేంత ఖాళీగా ఉండటంతో పాటు, అంత అవసరం ఏంటనే చర్చ కూడా నడుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే.. ఆ పికప్ సర్వీస్‌ను ఏపీ సీఎస్ భుజానికెత్తుకోవడం రాజకీయ వర్గాలను విస్తుపోయేలా చేసింది.

Leave A Reply

Your email address will not be published.