మునుగోడు అభ్యర్ధులపై ఓటర్లు ఆగ్రహం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా మారిన మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్థులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. దేశంలోనే కాస్ట్‌లీ ఎన్నికగా ప్రచారమైన మునుగోడు ఉపఎన్నిక చివరి అంకంలో నేలచూపులు చూస్తోంది. ‘అంతన్నడు.. ఇంతన్నడే.. గంగరాజు.. ’ అన్న సామెత చందంగా మారింది మునుగోడు అభ్యర్థుల పరిస్థితి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం మునుగోడు ఉపఎన్నికపై భారీ అంచనాలు పెరిగాయి. నేషనల్ మీడియా సైతం ఈ ఉపఎన్నికపై ఆసక్తిగా చూస్తుంది. దీనికి తోడు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనుండడంతో ఈ ఉపఎన్నికకు మరింత ప్రాధాన్యం పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మునుగోడు ఉపఎన్నిక మొత్తంలో రూ.వందల కోట్లు ఖర్చు చేయనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మునుగోడు ఓటర్లకు సైతం భారీగా నగదు, ఇతర ప్రోత్సహకాలు ముట్టజెప్పుతారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఇతర నియోజకవర్గాల్లో సెటిల్ అయిన ఓటర్లు సైతం.. తిరిగి మునుగోడు నియోజకవర్గంలో ఓటు నమోదు చేయించుకున్నారంటే పరిస్థితి ఏలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా మునుగోడు ఉపఎన్నిక చివరి అంకానికి చేరుకుంది. ఇక ఓటర్లకు నగదు పంచడమే తరువాయిగా మిగిలింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు ఓటర్లకు.. అటు అభ్యర్థులకు కొత్త టెన్షన్ పట్టుకుంది.

మునుగోడు ఉపఎన్నికలో ఒక్కో ఓటుకు రూ.30 వేల నుంచి రూ.60వేల వరకు గిట్టుబాటు అవుతుందనే ప్రచారం భారీగా జరిగింది. ఉపఎన్నిక ప్రచారం మొదలైన నాటి నుంచి నిత్యం మద్యం, బిర్యానీ పంపకం.. ప్రచారానికి వెళ్తే రూ.వెయ్యి నగదు ఇస్తున్నట్లు తదితర ప్రచారాలెన్నో జరిగాయి. నిజానికి మునుగోడు నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలకే ఆ పరిస్థితి పరిమితమయ్యింది. కానీ ఓటుకు భారీగా నగదు ఇస్తున్నారనే ప్రచారం మాత్రం ఖండాంతరాలకు దాటిపోయింది. మునుగోడు ఓటర్లకు మిగతా నియోజకవర్గాల్లో ఉన్న బంధువులు, స్నేహితులు ఫోన్లు చేసి మరీ.. మీకు అంత నగదు ఇస్తున్నారాట..? ఓటుకు తులం బంగారం ఇస్తున్నారటగా అని వాకబు చేయడం పరిపాటిగా మారింది.

 

Leave A Reply

Your email address will not be published.