చార్మినార్‌ అయినా రిజిస్ట్రేషన్‌ చేసే అధికారం మాకుంది

.. బాన్సువాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు .. సమస్య తలెత్తితే మాకేంటి? పంచాయతీ కార్యదర్శులు బలవుతారు .. ఒకే ఇంటి నెంబర్‌తో 13 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ .. బలవుతున్న సామాన్య ప్రజలు

తెలంగాణ జ్యోతి/ వెబ్‌ న్యూస్‌/ నెట్‌వర్క్‌ ఇంచార్జీ హైదరాబాద్‌:
స్టాంపు డ్యూటీ కడితే చాలు తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న చారిత్రాత్మకమైన కట్టడం చార్మినార్‌ను సైతం రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చే అధికారం తమకు ఉందని సాక్షాత్తు స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ బాన్సువాడ సబ్‌ రిజిస్ట్రార్‌ చెప్తున్న మాటలివి. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్‌ మండలంలో గల దామరంచ గ్రామపంచాయతీ పరిధిలో బాన్సువాడ`బీర్కూర్‌ ప్రధాన రహదారిని ఆనుకుని గతంలో ఒక రైస్‌మిల్‌ 533 గజాల విస్తీర్ణంలో ఉండేది. సదరు రైస్‌మిల్‌ యజమాని తన వ్యక్తిగత అవసరాల కొరకు రైస్‌మిల్లుతో పాటు దానికి అనుసంధానంగా ఉన్న సుమారు 7000ల గజాల స్థలాన్ని ఒక కోటి రూపాయలకు కొంతమంది వ్యక్తులకు విక్రయించారు.

ఇంత వరకు బాగానే ఉంది. ఈ స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తులు అక్రమ సంపాదనే ధ్యేయంగా రాజకీయ నాయకుల అండదండలతో నిబందనలకు విరుద్దంగా కేవలం గ్రామపంచాయతీ నుండి జారీ చేయబడిన యజమాని దృవీకరణ పత్రంతో రిజిస్ట్రేషన్లు చేసి ప్లాట్ల విక్రయాలు చేపట్టడం గమనార్హం. నిబందనలకు లోబడి 300 గజాలకు మించి విస్తీర్ణం ఉన్నట్లైతే జిల్లా టౌన్‌ ప్లానింగ్‌ అధికారికి సంబందిత గ్రామపంచాయతీ నుండి ఎన్‌ ఓ సి తో పాటు నాలా కన్వర్షన్‌ తదితర పత్రాలతో టౌన్‌ ప్లానింగ్‌ అధికారికి దరఖాస్తు చేసుకుని అక్కడి నుండి అనుమతులు మంజూరైన అనంతరం 10 శాతం భూమిని గ్రామపంచాయతీకి కేటాయించి తదనంతరం అట్టి స్థలంలో సుందరంగా రోడ్లు, డ్రైనేజీలు, విద్యుద్దీపాల అలంకరణ చేసిన తదుపరి ప్లాట్లు విక్రయించాల్సి ఉంటుంది. దామరంచలో మాత్రం ఈ నిబందనలకు వ్యతిరేకంగా కేవలం ఇంటి నెంబర్‌తోనే రిజిస్ట్రేషన్లు చేసి ప్లాట్లను విక్రయించడం కొసమెరుపు. గ్రామపంచాయతీ నుండి 2022 మార్చి 14వ తేదీనా ఇంటినెంబర్‌ 3-80, అసెస్‌మెంట్‌ నెంబర్‌ 610తో యాజమాన్య హక్కు దృవీకరణ పత్రం పొంది దీని ఆధారంగా అక్కడ ఉన్నటువంటి 7000ల గజాల స్థలంలో

13 మంది వ్యక్తులకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించి విక్రయాలు చేపట్టినట్లు తెలుస్తుంది. సంబందిత సబ్‌ రిజిస్ట్రార్‌ సైతం రిజిస్ట్రేషన్‌ చేసే ముందు సరైన దృవపత్రాలు ఉన్నట్లైతే రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంది. ఇక్కడ అవేమీ పరిగణలోకి తీసుకోకుండా నిబందనలకు విరుద్దంగా రిజిస్ట్రేషన్‌ చేయడం ఆ శాఖలో జరిగే అవినీతికి అద్దం పడుతుంది. అంతేకాకుండా సంబందిత డోర్‌ నెంబర్‌ 3-80 లో అసెస్‌మెంట్‌ నెంబర్‌ 610 పంచాయతీ డిమాండ్‌ రిజిస్టార్‌ ప్రకారం కేవలం 533 గజాల భూమికి ఈ యాజమాన్య దృవీకరణ పత్రం వర్తించాల్సి ఉండగా 533 గజాలకు అనుసంధానంగా ఉన్న భూమిని సైతం డీటీసీపీ అప్రువల్‌ లేకుండానే ఒకే ఇంటి నెంబర్‌తో 13 మంది పేరిట రిజిస్ట్రేషన్లు జరిగాయి. భూమిని కొనుగోలు చేసిన లబ్దిదారులు మొటేషన్‌ కొరకు సంబందిత గ్రామపంచాయతీకి దరఖాస్తు చేసుకుంటే ఆ పంచాయతీ అధికారులు ఈ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ నిబందనల ప్రకారం జరగలేదు, దీనికి తాము మొటేషన్‌ చేయలేమని సమాదానం చెప్పినట్లు సమాచారం. దీంతో కొనుగోలుదారులు

ఆందోళనకు గురవుతున్నారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రోజుకో చోట సబ్‌ రిజిస్ట్రార్లు ముడుపులు అందుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడడం జరుగుతూనే ఉన్నప్పటికి ఆ శాఖ అధికారుల పనితీరు లో మార్పు రావడం లేదు. ఏవైనా సమస్యలు తలెత్తితే ఓనర్‌ షిప్‌ సర్టిఫికేట్లు జారీ చేసిన పంచాయతీ అధికారులే బలవుతారంటూ బాన్సువాడ సబ్‌ రిజిస్ట్రార్‌ సమాధానం చెప్పడం వారి పనితీరుకు నిదర్శనం. ఏది ఏమైనప్పటికి బాన్సువాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్లపై ఉన్నత శాఖ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డ అధికారిపై చర్యలు తీసుకోవడంతో పాటు డాక్యుమెంట్లను సైతం రద్దు చేయవలసిందిగా డివిజన్‌ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

.. స్టాంపు డ్యూటీ కడితే చార్మినార్‌ ను సైతం రిజిస్ట్రేషన్‌ చేసే అధికారం మాకుంది
.. స్వామిదాస్‌, బాన్సువాడ సబ్‌ రిజిస్ట్రార్‌

బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్‌ మండలం దామరంచ గ్రామపంచాయతీ పరిధిలో జరిగినటువంటి అక్రమ రిజిస్ట్రేషన్ల పై తెలంగాణ జ్యోతి వెబ్‌ న్యూస్‌ ప్రతినిధి బాన్సువాడ సబ్‌ రిజిస్ట్రార్‌ స్వామిదాస్‌ను వివరణ కోరగా లింక్‌ డాక్యుమెంట్లు, పంచాయతీ కార్యదర్శి జారీ చేసిన ఓనర్‌షిప్‌ సర్టిఫికేట్‌ ఆధారంగానే రిజిస్ట్రేషన్‌ చేయడం జరిగిందని, ఈ విషయంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా తాను సమాధానం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని పేర్కొనడంతో పాటు స్టాంప్‌ డ్యూటీ కడితే చార్మినార్‌ను సైతం రిజిస్ట్రేషన్‌ చేసే అధికారం తమకు ఉందని ఆయన సమాధానమిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.