ఈటల, కిరణ్ కుమారెడ్డిలకు కీలక పదవులు ఎందుకు ?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎన్నికల సమయంలో బీజేపీ దూకుడు పెంచింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు, త్వరలో పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సంస్థాగతంగా బీజేపీ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు అధ్యక్షులను మార్చడమే కాకుండా పలువురు సీనియర్లకు ప్రమోషన్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. ముఖ్యంగా.. కిరణ్ కుమారెడ్డికి బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగాఈటల రాజేందర్‌కు తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా కీలక పదవులను కట్టబెట్టింది. అయితే ఈ ఇద్దర్నీ కీలక పదవులు వరించడంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ ఈ ఇద్దరి గురించే పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. వాస్తవానికి బీజేపీలో కీలక పదవులు పొందాలంటే కచ్చితంగా ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ ఉండాల్సిందేనని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అయితే ఈటల, కిరణ్ రెడ్డికి ఆ బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికీ కీలక పదవులు వరించడంతో హాట్ టాపిక్ అయ్యారు.

బీఆర్ఎస్‌లో పరిస్థితులు అనుకూలించక.. తిరుగుబాటు చేసిన ఈటల రాజేందర్ ‘కారు’ (బీఆర్ఎస్) దిగి.. కాషాయ కండువా కప్పుకున్నారు. అంతేకాదు.. తనకున్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ హుజురాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచి నిలిచారు. ఆ మరుసటి రోజు నుంచే ఈటలకు కీలక పదవి ఇస్తారని టాక్ నడిచింది కానీ అదేమీ జరగలేదు. ఉద్యమ నాయకుడిగా, బీసీ నాయకుడిగా ఈటలకు మంచి గుర్తింపు ఉంది. వీటన్నింటికీ మించి బీఆర్ఎస్ లోటుపాట్లు బాగా తెలిసిన వ్యక్తిగా.. సీఎం కేసీఆర్‌ను ఢీకొనే ఏకైక నేతగా భావించిన బీజేపీ నాయకత్వం ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎమ్మెల్యేలుగా రఘునందనరావు, రాజాసింగ్.. ఇంకా చాలా మంది సీనియర్ నేతలు బీజేపీలో ఉన్నప్పటికీ.. ఈటలకు ఇస్తేనే అన్ని విధాలుగా న్యాయం చేస్తారని, కేసీఆర్‌తో ఢీ కొనడానికి ఇతనే కరెక్టని అధిష్టానం భావించింది గనుకే కీలక పదవి కట్టబెట్టినట్లు కూడా మరోవైపు చర్చ జరుగుతోంది. వాస్తవానికి రాజేందర్‌కు ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌‌గా నియమించే అవకాశాలు ఉన్నాయని చాలా రోజులుగా ప్రచారం జరిగింది. సీన్ కట్ చేస్తే.. అంతకుమించి కీలక బాధ్యతలనే అధిష్టానం కట్టబెట్టింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పట్నుంచీ కీలక నేతలు, సీనియర్లు చాలా మందే బీజేపీనే నమ్ముకుని ఉన్నారు. ముఖ్యంగా.. విష్ణుకుమార్ రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్, మాధవ్‌తో పాటు చాలా మంది సీనియర్లు కొన్నేళ్లుగా బీజేపీలోనే ఉంటున్నారు. అంతేకాదు ఇతర పార్టీల నుంచి కూడా చాలా మందే ముఖ్యనేతలు కాషాయ కండువాలు కప్పుకున్నారు. అయితే వీరందర్నీ కాదని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి.. బీజేపీ హైకమాండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమించడంతో ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది. కిరణ్‌కు స్పీకర్‌గా, ముఖ్యమంత్రిగా.. ఇతర కీలక పదవుల్లో పనిచేసిన అపార అనుభవం ఉంది. ఇంత సుదీర్ఘమైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కిరణ్ రెడ్డికి ఈ పదవిని కట్టబెట్టిందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రాలో కాంగ్రెస్‌‌లో పనిచేసిన అందరితోనూ ఇప్పటికీ పరిచయాలున్నాయి. పైగా ఆ సినయర్లంతా ఇప్పుడు బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌లో కొనసాగుతూ వస్తున్నారు. వారిని పార్టీలోకి రప్పించడానికి.. కిరణ్‌ను అస్త్రంగా ప్రయోగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతేకాదు.. కోస్తాఆంధ్రతో పోలిస్తే రాయలసీమలో బీజేపీ అంత పట్టులేదు.. ఇప్పుడు కీలక పదవి ఇవ్వడంతో బలోపేతం చేసుకోవచ్చనే ఆలోచన కూడా ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.