రాజకీయ పార్టీలపై ఆషాఢం ఎఫెక్ట్ పడనుందా ?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా కూడా రాజకీయ పార్టీలపై ఆషాఢం ఎఫెక్ట్ పడిందా?  అంటే.. ఔననే అంటు న్నారు పరిశీలకులు. మరో నాలుగైదు నెలల్లోనే ఎన్నికలు ఉన్న తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీలు విపక్ష పార్టీలు ఇతర పార్టీల నుంచి జంపింగులను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాయి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కార్యాచ రణను కూడా ముమ్మరం చేశాయి. బీజేపీ అయితే.. దాదాపు అన్ని ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనూ చేరికల కమిటీ అంటూ.. ఇతర పార్టీల్లోని కీలక నేతలకు గేలం వేసే పనిని అధికారికంగానే ముమ్మరం చేసింది.పైగా.. ఈ కమిటీలోనూ కీలక నేతలను ఏర్పాటు చేసి.. నిత్యం వారికి అదే పనిని అప్పగించింది. వచ్చే నెల రోజుల్లో ఈ కార్యక్రమా న్ని ముమ్మరం చేసి.. సాధ్యమైనంత వరకు కీలక నాయకులు.. గెలుపు గుర్రం ఎక్కే యువ నేతలను కూడా బీజేపీవైపు మళ్లిం చాలనేది ప్రధాన లక్ష్యం.ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే.. తెలంగాణ ఏపీల్లోనూ అధికార ప్రతిపక్షాలు.. ఇతర పార్టీల నుంచి  వచ్చే నాయకులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ ఎస్ అధినేత సీఎం కేసీఆర్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు.
ఏపీలో టీడీపీ సహా వైసీపీ కూడా.. చేరేవారికి అడ్డు చెప్పకుండా చేర్చుకునే పనిని చేపట్టాయి. ఇప్పటికే కొందరు నాయకులు కూడా ఇటు టీడీపీతోనూ.. అటు వైసీపీతోనూ టచ్లోకి వచ్చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.వీరంతా ఎక్కడికక్కడ పార్టీలు మారితే.. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతాయని ప్రధాన పార్టీలు లెక్కలు వేస్తున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. తాజాగా ఆషాఢ మాసం ప్రవేశించడంతో రాజకీయ పార్టీల్లోనూ సెంటిమెంట్లకు ప్రాధాన్యం పెరిగిపోయిన దరిమిలా.. నాయకులు ఎక్కడికక్కడ మౌనం పాటిస్తున్నారు.
ఇటీవల టీడీపీలో చేరేందుకు ముందుకు వచ్చిన వైసీపీ కీలక నేతలు ఇద్దరు.. ముహూర్తం‘ కుదరలేదంటూ.. మౌనంగా ఉన్నారు. అయితే.. పార్టీ కార్యక్రమాల్లో మాత్రం బహిరంగంగానే పాల్గొంటున్నారు. పార్టీ జెండా కప్పుకోవడం కోసం ముహూర్తం చూసుకుంటున్నారు. మరికొందరు శ్రావణ మాసం వస్తే తప్ప.. తమ నిర్ణయం కూడా చెప్పేది లేదని.. తెలంగాణ నేతలు చెబుతున్నారు.ఇక కొందరు అయితే.. తమ జాతకాలు తిధి వార నక్షత్రాలు చూపించుకునే పనిలో పడ్డారట. మొత్తానికి పార్టీల్లో చేరికలకు ఆషాఢం నేతలను ఇరకాటంలోకి నెట్టిందని అంటున్నారు పరిశీలకులు.

Leave A Reply

Your email address will not be published.