కాంగ్రెస్‌తో బీఆర్ఎస్‌ చేతులు కలుపనుందా?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్‌తో ఒక్కసారిగా బీఆర్ఎస్‌లో ఆందోళన మొదలైంది.ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలు ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం రాహుల్ గాంధీ విషయంలో చేసిన అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని భావిస్తున్నారు కేసీఆర్. రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తూ కేసీఆర్ చేసిన ప్రకటనతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌తో మైత్రి కన్ఫామ్‌ అన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు.. గులాబీ దళపతి సిగ్నల్ ఇవ్వకుండానే వామపక్షాలు కలిసి పోటీ చేసేందుకు కసరత్తు ప్రారంభించాయి. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో బీఆర్ఎస్‌ క్యాడర్‌లో ఏం జరగబోతోందన్న అయోమయం నెలకొంది. ఇప్పటికే రెండుసార్లు విచారించిన ఈడీ.. తదుపరి విచారణ తేదీని హోల్డ్‌లో పెట్టింది. ఈ లోగా కింది స్థాయి క్యాడర్ నుంచి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా అధికార పార్టీలో అయోమయం ఏర్పడింది. దీని నుంచి గట్టెక్కడానికి ముఖ్యమంత్రి నేరుగా రంగంలోకి దిగారు. ఆత్మీయ సమ్మేళనాల పేరిట మంత్రులుఎమ్మెల్యేలు నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూనే.. ఇంకోవైపు క్యాడర్‌ను కాపాడుకునే పనిలో పడ్డారు అధినేత. దీనిలో భాగంగా తెలంగాణ సమాజాన్ని ఉద్దేశిస్తూ ఈనెల 19న సుధీర్ఘ లేఖ రాశారు. ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో నెలకొన్న అనేక సమస్యలుఇబ్బందులను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రజలకు రాసిన లేఖలో సీఎం కేసీఆర్ ప్రస్తావించారు.

ఆత్మీయ సమ్మేళనాల్లో తీవ్ర అసంతృప్తి

అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగినా.. ఫలితం లేకపోయింది. ఈనెల 20న రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గల్లో నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి బయట పడింది. పార్టీలో మొదటి నుంచి పని చేస్తున్న వారికి తగిన ప్రాధాన్యత లేకపోవడంతో మంత్రి తలసాని లాంటి వాళ్ళను ఏకాకంగా ఆత్మీయ సమ్మేళనంలోనే కడిగి పడేసారు కార్యకర్తలు. మరోవైపు.. టికెట్ల కోసం అసమ్మతి నేతలు స్వరం పెంచుతున్నారు. సిట్టింగ్‌లుఆశవాహులు పక్క చూపులు చూడటంతో గందరగోళం నెలకొంది. ఇప్పటికే కొన్ని విషయంలో ప్రభుత్వం వ్యతిరేకత మూటగట్టుకుంది. ఇప్పుడు ఇలా ఒక్కోక్కటిగా సమస్యలు బయటపడుతుండటంతో నేతల్లో కలవరం మొదలైంది.

ఇక పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వానికి భారీగా నష్టం తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో కాంగ్రెస్బీజేపీ దూకుడు పెంచాయి. రాష్ట్రవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ కార్యాచరణ సిద్ధం చేస్తుండగా.. నిరుద్యోగ యువతకు మద్దతుగా బీజేపీ రంగంలోకి దిగింది. శుక్రవారం కాంగ్రెస్ చేపట్టిన ఓయూ నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో వారమంతా ఆందోళనలు చేయాలని నిర్ణయించింది కాంగ్రెస్. ఇక బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరుద్యోగ నిరసన గళంతో సర్కార్ మీద మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.