చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల సక్సెస్ అవుతారా..?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీఆర్ఎస్ లో సుదీర్ఘ కాలం పనిచేయడమే కాకుండా ఆర్థిక వైద్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ అనూహ్యంగా పార్టీ మారాల్సి వచ్చింది. అయితే అప్పటికే రాజకీయ పండితుడైన ఈటలకు బీజేపీ రెడ్ కార్పెట్ పరిచింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఆయనను గెలిపించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్ గా నియమించింది. అయితే ఈటల వచ్చిన కొత్తలో ఆయన అనుచరులు ఆయనతో సత్సంబంధాలు ఉన్న వాళ్లు కొంత మంది బీజేపీలో చేరారు. కానీ ఆ తరువాత కాషాయ కండువా కప్పుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి ఈ పార్టీకి మారడానికి తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఈటలకు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తారా..చేరికల కమిటీ చైర్మన్ గా సక్సెస్ అవుతారా..అనేది హాట్ టాపిక్ గా మారింది.తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడి తరువాత ఈటల రాజేందర్ కు ప్రాధాన్యత ఉందని చెప్పుకుంటారు. దీంతో ఆయనకు చేరికల కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజేందర్ ఒత్తిడిగా ఫీలవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. బీజేపీలో కేసీఆర్ కోవర్టులున్నారని ఈటల ఆవేదన వైరల్ అయ్యింది. కేసీఆర్ ప్రతి పార్టీలో కోవర్టులను నియమించారని బీజేపీలోనూ ఉన్నారని ఆరోపణలు చేశారు. అందుకే తమ పార్టీలో ఎవరూ చేరడం లేదన్నట్లు కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే తాను తన బాధ్యతను సరిగా నిర్వర్తించలేకపోతున్నామని మథనపడుతున్నట్లు సమాచారం.అసెంబ్లీ ఎన్నికల్లో మరెంతో సమయం లేదు. ఈ కొద్ది కాలంలో ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను చేర్చుకుంటేనే ఎన్నికల వరకు వారు పార్టీ మారిన సంగతి ప్రజలకు తెలుస్తోంది. సరాసరి ఎన్నికల సమయానికి కొందరు గుర్తింపు ఉన్న నాయకులు పార్టీ మారినా ఇబ్బందే అవుతుంది. అందువల్ల టైం దగ్గరపడుతున్నకొద్దీ ఈటలకు ఏం చేయాలో అర్థం కావడం లేదని కొందరు బీజేపీ నాయకులు అనుకుంటున్నారు.రాష్ట్రంలో ప్రస్తుతానికి బీఆర్ఎస్ తరువాత బీజేపీనే బలమైన పార్టీగా చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ లో కేడర్ ఉన్నా అసంతృప్తులతో ఆ పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తోంది. అయితే మొన్నటి వరకు బీజేపీలో అందరూ ఒక్క తాటిపై నడిచారు. కానీ  ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారని కొందరు చర్చించుకుంటున్నారు. ఒక్కోసారి ఈటల కొందరు నాయకుల పేర్లు ప్రతిపాదించినా మిగతా వారికి నచ్చడం లేదని తెలుస్తోంది. మరోవైపు కొందరు నాయకులతో ఈటల సంప్రదింపులు జరపడంతో ఆ విషయాలు ఇతర పార్టీలకు తెలిసిపోతున్నాయి. దీంతో పార్టీ అధినేతలు జాగ్రత్త పడుతున్నారని ఈటల భావిస్తున్నట్టు తెలుస్తోంది.అయితే ఈటల తాజాగా చేసిన కామెంట్స్ పార్టీలో అయోమయం నెలకొంది. బీజేపీలో ఎవరు కోవర్టులు ఉన్నారో తెలియక అందరూ ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఈటల కామెంట్స్ తో కొందరు డిఫెన్స్ లో పడ్డట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే నాయకులు కూడా ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తోంది. ఇప్పుడున్న బీజేపీకి ప్రజా బలం ఉన్నా.. నాయకుల బలం తక్కువే అని చెప్పవచ్చు. ఇతర పార్టీల నుంచి గెలుపు గుర్రాలను చేర్చుకోకపోతే ప్రజలు ఆదరించే అవకాశం లేదు. అందువల్ల ఈటలకు  పెద్ద బాధ్యతను అప్పగించారు. మరి ఎన్నికల నాటికైనా ఈటల తన పదవిలో సక్సెస్ అవుతారా..చూడాలి.

Leave A Reply

Your email address will not be published.