ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌లో చేరతారా?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీలో రెండు గంటలకు పైగా ప్రసంగించారు. బీజేపీపై, నరేంద్ర మోదీపై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై నిప్పులు చెరిగారు. కానీ.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను మాత్రం ‘మిత్రుడు ఈటల రాజేందర్‌ చెప్పినట్లు’ అంటూ సంబోధిస్తూ ఆయన లేవనెత్తిన డిమాండ్ల పట్ల కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. డైట్ చార్జీలు పెంచాలని కోరిన ఈటల డిమాండ్‌కు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని హరీష్‌రావుకు కేసీఆర్‌ ఆదేశించారు. డైట్ చార్జీల పెంపు ఏ మేరకు ఉండాలనేది ఈటలను సంప్రదించి వివరాలు తీసుకోవాలని హరీష్‌రావుకు సీఎం సూచించారు. అంతేకాదు.. అసెంబ్లీలో ఈటల పేరును సీఎం కేసీఆర్‌ పదేపదే ప్రస్తావించారు. 2 గంటల కేసీఆర్‌ ప్రసంగంలో 10 సార్లకు పైగా ఈటల పేరు ప్రస్తావనకు రావడం కొసమెరుపు. ఈటల పేరును కేసీఆర్ అంతలా ప్రస్తావించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. కేసీఆర్‌ మాట్లాడిన మాటల వెనుక ఏదో బలమైన కారణం ఉండకపోలేదంటూ గుసగుసలు మొదలయ్యాయి. బీజేపీ చేరికల కమిటీకి చైర్మన్‌గా ఈటల రాజేందర్‌ ఉండటం గమనార్హం. ఇటీవల జరిగిన మరో పరిణామం కూడా ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌లో చేరతారనే వార్తలకు కారణమైంది.

ఫిబ్రవరి 3న తెలంగాణ శాసనసభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఉభయసభలు సమావేశం కావడానికి ముందు మంత్రి కేటీఆర్‌ విపక్ష సభ్యులందరినీ పలకరించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తో రెండుసార్లు ప్రత్యేకంగా మాటామంతీ జరిపారు. ఇటీవల హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని జమ్మికుంటలో జరిగిన కార్యక్రమానికి సంబంధించి ప్రొటోకాల్‌ అంశం వీరి మధ్య చర్చకు వచ్చింది. ‘‘అధికారిక కార్యక్రమానికి ఎందుకు రాలేదు?’’ అని మంత్రి కేటీఆర్‌.. ఈటలను ప్రశ్నించగా, ‘పిలిస్తే కదా హాజరయ్యేది!’ అంటూ ఈటల బదులిచ్చారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పద్ధతి సరిగ్గా లేదని ఈటల రాజేందర్‌ ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌తో అన్నారు. కాగా, ఆ సమయంలో ఈటల వెనకాలే ఉన్న కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఎంట్రీ అయి.. ఈటల నెత్తిని నిమురుతూ కనిపించారు. తనను గెంటేశారని బీఆర్‌ఎస్‌పై, కేసీఆర్‌పై దుమ్మెత్తిపోసి మరీ బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్‌తో కేటీఆర్ అంత సన్నిహితంగా మెలగడం చూసి ఈటల మళ్లీ బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.

నిన్న అసెంబ్లీలో కేసీఆర్ కూడా ఈటలను అన్నిసార్లు తలచుకోవడంతో ఈ ప్రచారానికి బలం చేకూర్చినట్లయింది. అయితే.. కేసీఆర్‌ పదేపదే తన పేరు ప్రస్తావించడంపై ఈటల స్పందించారు. తనను డ్యామేజ్‌ చేసే వ్యూహంతోనే కేసీఆర్‌ అలా మాట్లాడారని ఆరోపించారు. BRSలో తిరిగి చేరేది లేదని ఈటల కుండబద్ధలు కొట్టి చెప్పారు. తనది పార్టీ మారే చరిత్ర కాదని, గెంటేసినవాళ్లు పిలిచినా పోనని ఈటల తెగేసి చెప్పారు. వైఎస్ హయాంలో కూడా ఇలానే ప్రచారం చేశారని గుర్తుచేశారు. తన ప్రశ్నలకు జవాబు చెప్పినంత మాత్రాన పొంగిపోనని, టీఆర్ఎస్‌లో సైనికుడిగా పనిచేశానని.. ఇప్పుడు బీజేపీలో కూడా అలానే పనిచేస్తానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్ చేరిక వార్తలకు చెక్ పెట్టారు. మొత్తంగా చూసుకుంటే.. ఈటల బీజేపీలోనే కీలక నేతగా ఎదిగే దిశగా అడుగులేస్తున్నారని తాజా పరిణామాలతో స్పష్టమైంది.

Leave A Reply

Your email address will not be published.