కమల్ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారా!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తరచూ విమర్శలు ఎక్కుపెట్టేవారిలో కమల్ హాసన్ ఒకరు. ఇటీవల న్యూఢిల్లీలో భారత జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి కమల్ హాసన్ సంఘీభావం ప్రకటించారు.అలాగే ప్రస్తుతం తమిళనాడులోని ఈరోడ్ లో జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని కమల్ హాసన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమల్ తన మక్కల్ నీది మయ్యమ్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.మరోవైపు మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వెబ్సైట్ సైతం హ్యాకింగ్ కు గురయింది. అందులో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్టు హ్యాకర్లు ఒక ప్రకటన ఉంచారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో విలీనం కావాలని పార్టీ నిర్ణయించినట్టు ఆ ప్రకటనలో ఉండటం గమనార్హం. అప్పట్లో ఇందిరాగాంధీని ఓడించేందుకు భిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీలన్నీ జనతా పార్టీగా ఏర్పడినట్టే బీజేపీని ఓడించేందుకు ఒకేరకమైన సిద్ధాంతాలు కలిగిన పార్టీలు ఎందుకు విలీనం కాకూడదంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆ ప్రకటనలో ఉంచారు.దీంతో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అప్రమత్తమైంది. పార్టీ విలీనవార్తలపై వివరణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఎంఎన్ఎం విలీనం వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పింది. తమ వెబ్సైట్ను ఎవరో హ్యాక్ చేశారని స్పష్టం చేసింది. వెబ్సైట్ను పునరుద్ధరించే పని జరుగుతోందని వెల్లడించింది.తమ పార్టీ వెబ్సైట్ హ్యాకింగ్ కి గురి అయిన ఘటనపై తాము దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీతో విలీనమనే వార్త పూర్తిగా అబద్ధమని స్పష్టం చేసింది. మక్కల్ నీది మయ్యమ్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనే ఆలోచనలు ఏమీ లేవని పేర్కొంది.అయితే ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికలో మాత్రం డీఎంకేకాంగ్రెస్ కూటమికి తమ పార్టీ మద్దతిస్తుందని మక్కల్ నీది మయ్యమ్ పేర్కొంది. దీనిపై తమ పార్టీ అధినేత కమల్హాసన్ త్వరలో అధికారిక ప్రకటన చేస్తారని వెల్లడించింది. ఈ మేరకు ఎంఎన్ఎం ప్రతినిధి మురళి అప్పాస్ మీడియాకు వివరాలు వెల్లడించారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వివిధ భాషల్లో ఉత్తమ నటుడిగా ఖ్యాతినార్జించిన కమల్ హాసన్ గత ఎన్నికల ముందు మక్కల్ నీది మయ్యమ్ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో గత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ హాసన్ తక్కువ ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

Leave A Reply

Your email address will not be published.