ఈటెల గజ్వేల్ రావడంతో కెసిఆర్ కు నిద్ర పట్టడం లేదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ బీజీపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్‌లో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేయడంతో కేసీఆర్‌కు నిద్రపట్టడం లేదని అన్నారు. ఈటల రాజేందర్ గజ్వేల్‌కు రావడంతో కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని చెప్పారు. గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గజ్వేల్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు.  ఈటల నామినేషన్ కార్యక్రమానికి హాజరైన కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీగా మారిందని అన్నారు. కేసీఆర్.. స్వరాష్ట్రంలో ప్రజలను బానిసలుగా మార్చుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే కేసీఆర్ కుటుంబానికి ఓటు వేసినట్టు అని.. అదే బీజేపీకి ఓటు వేస్తే భవిష్యత్తు తరాల అభివృద్దికి ఓటు వేసినట్టు అని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. బడుగు, బలహీన వర్గాల పాలన రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.  మరోవైపు ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గజ్వేల్ నియోజకవర్గంలో 15 సంవత్సరాలు ఉన్నానని.. తాను పరాయి వాడిని కాదని అన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని అన్నారు. ఈ రోజు తన నామినేషన్‌ ర్యాలీకి ప్రజలను రాకుండా ఆపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అయితే ఊహించన దానికంటే ఎక్కువ జంన వచ్చారని చెప్పారు. తనకు హుజురబాద్ కంటే గజ్వేల్‌లోనే ఎక్కువ మెజారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.