మహిళలు బాడీ షేమింగ్ నుంచి బయటపడాలి

- తెలంగాణ గవర్నర్ తమిళి సై పిలుపు

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బాడీ షేమింగ్ .దీన్ని భరించలేకనేనేమో.. మహిళలంతా అందంపై దృష్టి సారిస్తున్నారు. బాడీ షేమింగ్ నుంచి బయటపడాలి.. మెరుగ్గా మారాలన్న తపనే ఎన్నో మానసిక ఆరోగ్య పరిస్థితులకు దారి తీస్తోంది. ఒక్కసారి సోషల్ మీడియా ను పరిశీలిస్తే వ్యక్తి శరీర ఆకృతిపై ఎన్ని జోక్స్ దర్శనమిస్తాయో చెప్పనక్కర్లేదు. సినిమాల్లో సైతం బాడీ షేమింగ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. మనిషి రంగు నుంచి లావు, సన్నగా ఉండటం.. ముక్కు వంకర, మూతి వంకర అంటూ హేళన చేస్తుంటారు. అవి ఎదుర్కొన్న వారికే దాని తాలూకు బాధ ఏ స్థాయిలో ఉంటుందో తెలుస్తుంది. తాజాగా ఒక ఘటనను పరిశీలిస్తే.. కాదెవరూ బాడీ షేమింగ్‌కు అనర్హం అని అనిపిస్తోంది.

అగ్గిలా మారి వణికిస్తా..

తాజాగా సాక్ష్యాత్తు తెలంగాణ గవర్నర్ తమిళి సై తనను బాడీ షేమింగ్ విమర్శలను ఎదుర్కొంటున్నానని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ ఆమె కాన్ఫిడెన్స్ ముందు బాడీ షేమింగ్ విమర్శలన్నీ మట్టిలో కలిసిపోయాయి. ‘‘నా శరీర రంగు గురించి కొందరు అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. నేను నల్లగా ఉన్నానని అంటున్న ప్రత్యర్థులను అగ్గిలా మారి వణికిస్తా’’ అని గవర్నర్‌ తమిళిసై హెచ్చరించారు. శనివారం తమిళిసై చెన్నై తండయార్‌పేటలోని బాలికల ప్రైవేటు పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన రంగు.. నుదుటిని సైతం హేళన చేస్తు్న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను నలుపు అంటే అగ్గిలా మారుతానని, బట్టతల ఉన్న వ్యక్తి అంటూ విమర్శించేవారు.. ఓర్వలేనంతగా ఉన్నత స్థాయికి చేరతానని వ్యాఖ్యానించారు.

స్టార్ హీరోయిన్ సాయి పల్లవి సైతం..

నిజానికి గవర్నర్ తమిళ్‌ సైకి బాడీ షేమింగ్ విమర్శలు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆమెను దిష్టిబొమ్మగా చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెలిశాయి. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున మండిపడ్డారు. కొందరు హీరోయిన్లకు కూడా బాడీ షేమింగ్ విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. సినిమాల్లోనూ బాడీ షేమింగ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సైడ్ క్యారెక్టర్స్ పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. ‘శ్యామ్ సింగరాయ్ మూవీ సమయంలో స్టార్ హీరోయిన్ సాయిపల్లవి సైతం బాడీ షేమింగ్‌ను ఎదుర్కొంది. దేవదాసి పాత్రలో సాయి పల్లవి అందంగా లేదంటూ తమిళనాట ఏకంగా ఒక వార్త ప్రచురితమవడం గమనార్హం. దీనిపై నెటిజన్లే కాదు.. తమిళిసై కూడా స్పందించారు. పొట్టిగా, నల్లగా, తనలా రింగుల జుట్టుతో పుట్టడమనేది మన చేతుల్లో లేదన్నారు. కేవలం మహిళలే బాడీ షేమింగ్‌కు గురవుతారని కానీ పురుషులకు అలాంటి పరిస్థితులు ఎదురు పడవన్నారు. 50 ఏళ్ల వయసులో ఉన్న పురుషులను కూడా యువకులుగానే చూస్తారని. కానీ స్త్రీలను మాత్రం అలా ఎన్నటికీ చూడరన్నారు.

సామాన్య మహిళల పరిస్థితేంటి?

గవర్నర్ అంతటి వారిపైనే బాడీ షేమింగ్ విమర్శలు వస్తుంటే.. సామాన్య మహిళల పరిస్థితేంటి? నిత్యం ఎక్కడ పడితే అక్కడ.. దారుణాతి దారుణంగా బాడీ షేమింగ్ విమర్శలను ఎదుర్కుంటూనే ఉంటారు. అయినా సరే.. పట్టించుకునే ప్రభుత్వాలేవి? పోలీసులేరి? చట్టం తన పని తాను చేసుకుపోతుందని పోలీసులు.. షీ టీమ్స్ ఏర్పాటు చేశామని ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటున్నాయి. ఇక ఈ విషయాలను ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే కొందరు మహిళలు కుమిలిపోతున్నారు. సొంత ఇంట్లో సైతం ఈ విమర్శలు ఎదుర్కొనే మహిళలు లేకపోలేదు. అయితే ఇది కొందరిని మానసికంగా దెబ్బ తీస్తే.. మరికొందరు మరింత ధృఢంగా మారి ఎదురయ్యే అవమానాలను తమ ఎదుగుదలకు వినియోగించుకుంటారు. విమర్శలేవైనా సున్నితంగా ఉండాలే కానీ హద్దు దాటితే ఇబ్బందికరమే. ఎదిగే క్రమంలో తగిలే రాళ్లు అన్నీ ఇన్నీ కావు. వాటన్నింటినీ పునాది చేసుకుని ఎదిగితే మంచి స్థాయిలో ఉంటాం. లేదని కృంగిపోతే మనతో పాటు జీవితమూ అక్కడే ఆగిపోతుంది.

Leave A Reply

Your email address will not be published.