మహిళలు 8 అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలి

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: దేశ జనాభాను పెంచేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలక ప్రకటన చేశారు. దేశంలోని మహిళలు ఎనిమిది అంతే కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని విజ్ఞప్తి చేశారు. రష్యాలో మరణాల సంఖ్య కంటే జననాల సంఖ్య నానాటికీ పడిపోతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో జనాభా సంక్షోభం అక్కడ తీవ్రమైంది. రష్యన్లు విదేశాలకు వలస వెళ్తున్నారు. దీంతో ఇటీవలే కాలంలో రష్యా అధికారులు ప్రజలను అధిక సంతానాన్ని కనే దిశగా ప్రోత్సహిస్తున్నారు. ప్రసవాలను పెంచేందుకు వివిధ కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. అయినప్పటికీ ఆ దేశంలో మరణాల రేటు కంటే జననాల రేటు చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో దేశ జనాభాను పెంచేందుకు అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఎనిమిది అంతే కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని విజ్ఞప్తి చేశారు.మంగళవారం మాస్కోలో జరిగిన వరల్డ్ రష్యన్ పీపుల్స్ కౌన్సిల్‌లో పుతిన్‌ వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. రాబోయే రోజుల్లో రష్యాలో జనాభా పెంచడమే తమ ప్రధాన లక్ష్యంగా వెల్లడించారు. ‘దేశంలోని చాలా మంది జాతుల ప్రజలు నలుగురు, ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థని కాపాడుకుంటూ వస్తున్నారు. మన పాతతరం (అమ్మమ్మలు, ముత్తాతల కాలం) వాళ్లు ఒక్కొక్కరు ఏడు, ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలనుకన్నారు. ఆ విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. ఆ అద్భుతమైన సంప్రదాయాలను మనమూ కాపాడుకుందాం. పెద్ద కుటుంబాలు రష్యా ప్రజలందరికీ కట్టుబాటు, జీవన విధానంగా మారాలి. రాబోయే రోజుల్లో దేశంలో జనాభా పెంచడమే మా ప్రధాన లక్ష్యం’ అని అన్నారు.

 

రష్యాలో జననాల రేటు 1990 నుంచి దారుణంగా పడిపోతోందని.. గత సంవత్సరం ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దేశం 3,00,000 కంటే ఎక్కువ మంది మరణించినట్లు ది ఇండిపెండెంట్‌ నివేదించింది. ఈ నేపథ్యంలో దేశంలో జనాభా పెరుగుదలకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలను కనడం విషయంలో దేశంలోని మహిళల్ని పోత్సహిస్తున్నారు. నేటి కాలం మహిళలు పిల్లలను కనడం కంటే చదువు, కెరీర్‌పైనే ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారని ఇటీవలే రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్‌ మురాష్కో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మహిళలు చదువుకోవాలి, ఉన్నతోద్యోగం సాధించాలి. ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాతే పెళ్లి, పిల్లల గురించి ఆలోచిస్తున్నారని అన్నారు. ఈ పద్ధతి సరికాదని వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.