మద్యం మత్తులో యువతరం

- గతేడాది నవంబర్‌ నాటికి డ్రంకెన్‌ డ్రైవ్‌ లో 19 వేల కేసులు నమోదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మద్యం మత్తులో యువతరం చిక్కుకుంది. కిక్కు‌కోసం పబ్‌లకు, బార్‌లకు పరుగులు తీస్తోంది. పబ్‌కల్చర్‌ యూత్‌ను ఉర్రూతలూగిస్తోంది. మత్తులో మునిగిన కుర్రకారు మితిమీరిన వేగంతో వాహనాలను నడిపి అదుపు తప్పుతోంది. ఖరీదైన కార్లతో రయ్యిమంటూ దూసుకుపోయి ప్రమాదాలకు కారణమవుతోంది. అర్ధరాత్రి ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండేందుకు నగర ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ను ప్రవేశపెట్టారు. శుక్ర, శనివారాల్లో ఈ తనిఖీలను ముమ్మరంగా నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నా..యువతలో మార్పు రావడం లేదు. తొలిరోజుల్లో డ్రంకెన్‌ డ్రైవ్‌ సత్ఫలితాలను ఇచ్చింది. మద్యం తాగిన వారు తూగుతూ…వాహనాలు నడపడం తగ్గించారు. తరువాత కాలంలో తూలుతూ వాహనం నడపడం క్రేజ్‌గా మార్చుకున్నారు. ఈ ఏడాది డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. గతేడాది నవంబర్‌ నాటికి సుమారు 19 వేల కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే పది శాతం కేసులతోపాటు జైలు శిక్షలు కూడా పెరిగాయి. అయినప్పటికీ మందు బాబుల వీరంగం ఏమాత్రం తగ్గడం లేదు.‘‘నగరానికి చెందిన ఓ యువకుడు అమ్మాయితో కలిసి పార్టీకి హాజరవ్వడానికి కారులో బంజారాహిల్స్‌

 వైపు వెళుతున్నాడు. డ్రంకెన్‌ డ్రైవ్‌తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్‌ పోలీసులు అతడ్ని ఆపి శ్వాస పరీక్ష చేయగా 98 BAC ఉందని తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులపై యువకుడు చిందులు తొక్కాడు.. దుర్భాషలాడడంతో పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు..’’ ‘‘సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన యువతి డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడింది. నా మీదే కేసు పెడతారా అంటూ పోలీసులపై రంకెలు వేసింది. దీంతో ఆమెపై క్రిమినల్‌ కేసు నమోదైంది. మత్తు దిగాక తాను చేసిన తప్పు తెలుసుకుంది. కానీ ఏమి లాభం? కేసు మాత్రం ఇంకా అలాగే కొనసాగుతోంది.’’

Leave A Reply

Your email address will not be published.