వైఎస్ సునీతారెడ్డి పొలిటికల్ ఎంట్రీ

- సునీతమ్మ గారికి స్వాగతం.. సుస్వాగతం’ అంటూ టీడీపీ పేరిట పోస్టర్లు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ విచారణ కీలక దశలో ఉంది. వీలైనంత త్వరగానే కేసును కొలిక్కి తీసుకురావాలని సీబీఐ చేయల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. ఇప్పటికే దూకుడు పెంచిన సీబీఐ అధికారులు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత కీలక పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు.. అవినాష్ ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. దీంతో ఇక అవినాష్‌కు దారులన్నీ మూసుకుపోయానని త్వరలోనే సీబీఐ ఆయన్ను అరెస్ట్ చేస్తుందని వార్తలు గుప్పుమంటున్నాయి. తన తండ్రిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని సునీతారెడ్డి అలుపెరగని పోటీ చేస్తున్నారు. ఇప్పటికే అవినాష్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆమెకు అనుకూలంగానే తీర్పునిచ్చింది. దీంతో ఆమె పోరాటం ఫలించిందని వివేకా అభిమానులు చెప్పుకుంటున్నారు. సరిగ్గా ఇదే టైమ్‌లో కడప జిల్లాలోని ప్రొద్దుటూరు‌ పట్టణంలో వైఎస్ సునీతారెడ్డి పేరిట పోస్టర్లు వెలిశాయి. ‘రాజకీయ రంగప్రవేశం చేయనున్న డాక్టర్. వైఎస్ సునీతమ్మ గారికి స్వాగతం.. సుస్వాగతం’ అంటూ టీడీపీ పేరిట పోస్టర్లు బయటికొచ్చాయి. ప్రస్తుతం ఈ పోస్టర్లు ఏపీలో తెగ చర్చనీయాంశం అవ్వగా.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. అసలు ఈ పోస్టర్లలో నిజమెంత..? దీనిపై వైసీపీ ఏమంటోంది..? అన్న విషయానికి వస్తే … వైఎస్ సునీతారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని చాలా రోజులుగానే వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సునీత టీడీపీలో చేరబోతున్నారని కామెంట్స్ చేశారు. అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా సునీత టచ్‌లో ఉన్నారని కూడా సజ్జల ఆరోపించారు. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్కే అయ్యింది. ఇప్పుడు ఏకంగా టీడీపీలో చేరబోతున్నారంటూ సునీత పేరిట పోస్టర్లు రావడంతో ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పైగా.. ఈ పోస్టర్‌లో చంద్రబాబు, నారా లోకేష్‌, అచ్చెన్నాయుడు, శ్రీనివాసరెడ్డి, బీటెక్ రవి ఫొటోలు ఉన్నాయి. పోస్టర్‌లో సునీత ఫొటో పెద్దగా ఉండగా.. ఓ వైపు వివేకా మరోవైపు భర్త రాజశేఖర్ రెడ్డి ఫొటోలు ఉన్నాయి. ఈ పోస్టర్లు ప్రొద్దుటూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రికి రాత్రే వెలిశాయి. ఈ పోస్టర్లు ఎవరు అతికించారనే విషయం తెలియట్లేదు కానీ.. ఈ వ్యవహారం అటు వైసీపీ.. ఇటు టీడీపీలో మాత్రం పెద్ద చర్చకే దారితీసింది. ఈ పోస్టర్లను కాస్త నిశితంగా గమనిస్తే.. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. టీడీపీ వాళ్లు ఈ పోస్టర్లు వేస్తే అధికారికంగా చెప్పుకుంటారు కానీ ఇలా రాత్రికి రాత్రే ఎవరు చేయించారనేది ఇప్పుడు సస్పెన్ష్‌గా మారింది.ఈ పోస్టర్ల వ్యవహారంపై ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జ్‌గా ప్రవీణ్ స్పందించారు. సునీతా పేరిట వెలిసిన పోస్టర్లకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకే ఇలా వైసీపీ నాయకులు ప్రొద్దుటూరును ఎంచుకున్నారని ప్రవీణ్ మండిపడ్డారు. వివేకా హత్య కేసు కీలక దశలో ఉండగా.. దాన్ని డైవర్ట్ చేసేందుకే సునీతారెడ్డి రాజకీయ ప్రవేశమంటూ పోస్టర్లు వైసీపీ నేతలే చేయించారని ఆయన చెప్పుకొచ్చారు. అసలు ఈ పోస్టర్ల వ్యవహారం వెనుక ఎవరున్నారో గుర్తించి పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మొత్తానికి చూస్తే.. ఈ పోస్టర్లపై టీడీపీ రియాక్ట్ అయ్యింది కానీ.. వైసీపీ నుంచి కానీ.. మరీ ముఖ్యంగా టీడీపీ నేతలు చిన్నపాటి ఆరోపణలు చేసినా వెంటనే రియాక్టయ్యే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నుంచి కానీ కనీస స్పందన రాకపోవడం గమనార్హం. ఇక సునీతారెడ్డి నుంచి ఈ పోస్టర్ల వ్యవహారంపై ఎలాంటి రియాక్షన్ వస్తుందో.. ఆమె ఏమేం మాట్లాడుతారో వేచి చూడాల్సిందే మరి.

Leave A Reply

Your email address will not be published.