ఇజ్రాయిల్ హమాస్ వార్ పై జోబయిడెన్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గాజాపై భూత‌ల దాడుల‌కు ఇజ్రాయెల్ సిద్ధ‌మ‌వుతుండ‌గా, ఇజ్రాయెల్‌-హ‌మాస్ వార్‌పై అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ (Joe Biden) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. యుద్ధం నేప‌ధ్యంలో ఆ ప్రాంతంలో భ‌ద్ర‌తా ప‌రిస్ధితులు క్షీణించ‌డం, పెద్ద‌సంఖ్య‌లో పౌరులు ప్రాణాలు కోల్పోతుండ‌టం ఆందోళ‌న రేకెత్తిస్తోంది. తాము వెన్నంటి ఉన్నామ‌నే భ‌రోసా ఇచ్చిన జో బైడెన్ ఇజ్రాయెల్ స్వ‌తంత్రంగా నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని పేర్కొన్నారు. యుద్ధ వ్యూహాల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఇజ్రాయెల్‌ను కోరారు.

మ‌రోవైపు గాజా స్ట్రిప్‌లో భూత‌ల దాడుల‌కు సిద్ధంగా ఉన్నామ‌ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్‌) స్ప‌ష్టం చేశాయి. ఇక గాజాలో మిలిటెంట్ గ్రూప్ హ‌మాస్ (Israel-Hamas War) ల‌క్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుప‌డుతోంది. 400 మిలిటెంట్ టార్గెట్ల‌పై ఫోక‌స్ చేస్తూ దాడుల‌ను తీవ్రత‌రం చేసింది. సోమ‌వారం రాత్రి నుంచి కొన‌సాగుతున్న దాడుల్లో డ‌జ‌న్ల కొద్దీ హ‌మాస్ ఫైట‌ర్ల‌ను మ‌ట్టుబెట్టామ‌ని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. వీరిలో ముగ్గురు డిప్యూటీ బెటాలియ‌న్ క‌మాండ‌ర్లు ఉన్నార‌ని వెల్ల‌డించింది.
స‌ముద్రం నుంచి సొరంగ మార్గం ద్వారా ఇజ్రాయెల్‌లోకి చొచ్చుకువ‌చ్చేందుకు హ‌మాస్‌కు స‌హ‌క‌రించే ట‌న్నెల్‌తో పాటు మ‌సీదుల్లో హ‌మాస్ క‌మాండ్ సెంట‌ర్ల‌ను ధ్వంసం చేశామ‌ని పేర్కొంది. మ‌రోవైపు హమాస్‌తో యుద్ధంలో భాగంగా గాజా స్ట్రిప్‌పై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. యుద్ధాన్ని తదుపరి దశకు తీసుకెళ్లేందుకు అనుకూల పరిస్థితులు సృష్టించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొన్నట్టు ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి డేనియల్‌ హగారీ తాజాగా వెల్లడించారు. గాజా సిటీలోని పౌరులు దక్షిణ గాజాలోకి వెళ్లిపోవాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు గాజాపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌.. హమాస్‌ను పూర్తిగా నాశనం చేసే లక్ష్యంతో తదుపరి భూతల దాడులు చేపట్టాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది.

Leave A Reply

Your email address will not be published.